జగన్ అతివిశ్వాసం దెబ్బ తీస్తుందా ?

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న మాట వినిపిస్తుంది. ఐదేళ్ళు అధికారంలో వున్న చంద్రబాబు ప్రజలకు ఏం చేశారు? అన్న ప్రశ్నవేసుకుంటే ఖచ్చితంగా ప్రజల నుండి వ్యతిరేక ఎదురుకోవాల్సివస్తుందని చెబుతున్నారు. ఈ వ్యతిరేకతే ప్రతిపక్షానికి ప్రధాన బలం. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బలం కూడా అదే. చంద్రబాబు చేసిన పాలనను ఎండగట్టి, ఇచ్చి హామీలని ఎలా గాలికి వదిలేశారో ప్రజలకు వివరించి, వారి విస్వాశాన్ని పొందడం జగన్ ముందున్న ప్రధాన కర్తవ్యం. జగననే కాదు.. రాజకీయాల్లో సహజంగా జరిగే ప్రక్రియ ఇదే. ఇపుడు వైఎస్ జగన్ కూడా ఈ విశ్వాసంతోనే వున్నారు. వస్తున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఆయనలో కనిపిస్తుంది. తప్పులేదు. ఆత్మ విశ్వాసం వుండడం నాయకుడి లక్షణం. అయితే ఈ విశ్వాసం అతివిశ్వాసం అవుతుందా ? అనే ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుండి వస్తుంది.

2014 ఎన్నికలని మర్చిపొతే ఎలా జగన్ ??

2014 ఎన్నికల ముందు, పోలింగ్ తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారనే మాట సర్వాత్ర వినిపించింది. జగన్ మోహన్ రెడ్డి కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేసి.. ఫారిన్ టూర్ కి వెళ్ళిపోయారు ఫ్యామిలీతో. వచ్చిన తర్వాత సక్సెస్ సంబరాలు జరుపుకుందామని చెప్పి. సర్వేలు కూడా జగన్ దే పవర్ అని చెప్పాయి. ఒక్కటి రెండు ఛానల్స్ తప్పా.. చాలా మటకు జగన్ వైపే విజయమని విశ్లేషణలు ఇచ్చాయి. అయితే సీన్ రివర్స్ అయ్యింది. చంద్రబాబు పవర్ లోకి వచ్చారు. జగన్ ది అతివిశ్వాసం అని తేలింది.

జగన్ పై ‘ ‘అహంకార” ప్రచారం :

2014లో వున్న సీనే ఇప్పుడూ కనిపిస్తుంది. సర్వేలు, ప్రజల నుండి వస్తున్న రెస్పాన్స్ జగన్ కి అనుకూలంగా వుంది. అయితే ఇలాంటి దశలో జగన్ పై మళ్ళీ ”అహంకార” ప్రచారం మొదలైయింది. వంగవీటి రాధ, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పార్టీని వీడిన క్రమంలో జగన్ పై ‘అహంకారి” ముద్ర వేసుకుంటూ వెళ్లారు. గత ఎన్నికల ముందూ సరిగ్గా ఇదే జరిగింది. రఘురామ కృష్ణమరాజు లాంటి నేతలు వైసీపీ నుండి బయటికి వస్తూ జగన్ కి చేయాల్సిన డ్యామేజీ చేసేశారు. ఇప్పుడు అదే ‘అహంకార”పదాన్ని జగన్ ప్రతికూల మీడియా జనాల్లో ప్రోజెక్ట్ చేస్తుంది. టీడీపీని వీడిన సందర్భంగా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పచ్చి మోసకారని దుమ్మెత్తిపోశారు. కానీ ఆ వార్తకి పెద్ద కవరేజి దొరకలేదు. ఎక్కడో చివరి పేజిలో చిన్న బాక్స్ ఐటెం గా కనిపించింది. అదే వంగవీటి రాధ, జగన్ ని విమర్శిస్తే మాత్రం మెయిన్ పేజ్ ఐటెం అయ్యింది. జగన్ ‘అహంకారి’ అంటూ ప్రచారం నడుపుతున్నారిప్పుడు. 2014లో జరిగినట్లే ఇప్పుడూ జగన్ ని ‘అహంకారి’ గా ప్రాజెక్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ విషయంలో జగన్ ఎత్తుగడ వేయాలి. దాన్ని తిప్పికొట్టాలి. అలా కాకుండా గత ఎన్నికల్లోలా ‘జనం నా వెంట వుంటారు. నేను చెప్పింది వింటారు’ అనే విశ్వాసం పెట్టుకుంటే మాత్రం అతివిశ్వాసమే అవుతుందనే చెప్పాలి. దీనికి 2014ఎన్నికల ముఖ చిత్రం సజీవ సాక్ష్యంగా వుంది.

2019 ఎన్నికల ముఖ చిత్రం పూర్తి భిన్నం:

2019 ఎన్నికల ముఖ చిత్రం 2014కి పూర్తి భిన్నంగా ఉండబోతుంది. 2014లో ‘1+1+1=విన్’ అనే సూత్రంతో చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ కలిశారు. జగన్ సోలోగా వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కనిపించలేదు. అయితే ఇప్పుడా ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు మోడీ విడిపోయారు. పవన్ కళ్యాణ్ కూడా కూటమి నుండి బయటికి వచ్చేశారు. ఎవరికీ వారు సొంతగా పోటికి దిగుతామని చెబుతున్నారు. మొన్నటివరకూ చంద్రబాబు కాంగ్రెస్ ని కలుపుకున్నట్లు కనిపించారు కానీ ఇప్పుడు ఆయన కూడా సోలోగానే దిగుతున్నారు.

కాంగ్రెస్ లీడర్లని అంత ఈజీగా తీసుకోకూడదు:

2019 ఎన్నికల విషయానికి వస్తే ఎవరికి వారు సోలోగానే బరిలోకి దిగుతారని ప్రస్తుత పరిస్థితిలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొగ్గు ఎవరివైపు వుంటుందో కీలకం. కారణాలు ఏమైనప్పటికీ రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో దాదాపు ఇన్ యాక్టివ్ అయిపోయింది కాంగ్రెస్. అయితే ఈ ఐదేళ్ళలో పరిస్థితులు మారాయి. ప్రజల మూడ్ కూడా మారింది. కాంగ్రెస్ పార్టీ కాస్త పక్కన పెడితే ఆ పార్టీలో వుండే నాయకులు 2019ఎన్నికల్లో ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది కీలకం కానుంది. ఎందుకంటే కోట్ల సూర్యప్రకాష్, పల్లం రాజు, హర్ష కుమార్… ఇలాంటి నాయకులంతా పవర్ ఫుల్ లీడర్లే. దాదాపుగా పాతిక వేలు ఓట్లు తెచ్చుకునే కెపాసిటి వున్న నాయకులే. ఇప్పుడు వీళ్ళు ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి. ఒకవేళ జగన్ కి వ్యతిరేకంగా వెళితే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ వుంటుంది.

రివర్స్ ఎటాక్ లో వైసీపీ విఫలం:

జగన్ పై ఆయన ప్రతికూల మీడియా సైలంట్ వార్ మొదలుపెట్టినట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లోలానే జగన్ ని అహంకారని ప్రాజెక్ట్ చేసే పనిలో వుంది మీడియా. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ నాయకులు గానీ సోషల్ మీడియా రూట్ లో పనిచేసే కార్యకర్తలు.. తిట్టిపోస్తున్నారు కానీ.. దాన్ని బాధ్యతాయుతంగా తిప్పికొట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపించడం లేదు.

బాబు ఇన్స్టంట్ మ్యాగీ ఆఫర్లు పై జగన్ నో కౌంటర్ :

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీకి ఓ అవకాశం వుంటుంది. విచ్ఛలవిడిగా ప్రజాకర్షక పధకాలు ప్రవేశపెట్టి ఓటర్లుకు ఇన్స్టంట్ మ్యాగీలా టిఫిన్ పెట్టడం. ప్రస్తుతం ఏపీలో కూడా అదే జరుగుతుంది. రెండు వేల రూపాయిల పెన్షన్లు ప్రకటించారు చంద్రబాబు. కానీ ఆయనే ఎన్నికల ముందు మూడు వేల రూపాయిలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇంతకాలం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల ఆఫర్ అన్నట్లు ప్రకటించారు. అయితే దీనికి జగన్ నుండి వచ్చే కౌంటర్ మాత్రం అంత స్ట్రాంగ్ గా లేదు. మేము ప్రవేశపెట్టబోయే పధకాలని చంద్రబాబు కాపీ కొడుతున్నారన్న గోల తప్పితే ఇంతకాలం ఏం చేశారని వాదన మాత్రం ఆయన నుండి రావడం లేదు. ప్రజలకు ఇలాంటి వాదనలు నమ్మకాన్ని ఇవ్వవు. రెండు వేల రుపాయిలు వచ్చాయికదా అనే ఆలోచనే వుంటుంది కానీ అది ఎవరి పధకం, ఎవరు కాపీ కొడితే ప్రజలకెందుకు?! అయితే తాను చెబితే ప్రజలు వింటారన్న విశ్వాసం జగన్ లో ఉండవచ్చు. అయితే ఇది విశ్వాసమా ? అతి విశ్వసమా ? అన్నది జగన్ తెలుసుకోవాలని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. గతంలో కూడా ఇలానే విశ్వాసం వుందని సర్వేలు చూసి ధీమా వున్న పార్టీ క్యాడర్.. ‘కుందేలు తాబేలు’ కధలా.. కుందేలు పాత్ర పోషించి సర్వేలు చూసి మురుసిపోయారు. తెలుగుదేశం పార్టీ తాబేలులా విజయాన్ని ముద్దాడింది. ఇప్పుడు కూడా జగన్ ది విశ్వాసమా ? అతివిశ్వాసమా? అన్నది మాత్రం కాలం తేల్చాలి.

ఇది Jourlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రింది వీడియో ని క్లిక్ చెయ్యండి.