Guntur Kaaram Review | గుంటూరు కారం రివ్యూ : వన్ మ్యాన్ షో

Guntur Kaaram Review

TELUGUMIRCHI.COM RATING : 3/5
అతడు, ఖలేజా సినిమాలతో క్లాసిక్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు మహేష్ అండ్ త్రివిక్రమ్. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే అది బాగుంటుంది అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అందుకే ఈ కాంబినేషన్ కోసం సినీ అభిమానులు దాదాపు 13 ఏళ్లు ఎదురు చూసారు, వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మహేష్-త్రివిక్రమ్ కలిసి గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. మరి ఈ మూవీ మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం

కథ:

జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్యనారాయణ (ప్రకాష్ రాజ్) తన కూతురు వసుంధర (రమ్యకృష్ణ)ని ఎంపీ చేయాలనుకుంటాడు కానీ కాటా మధు (రవి శంకర్) నుంచి ఊహించని సమస్య మొదలవుతుంది. ఇలాంటి సమయంలో ఆ సమస్య తీరాలంటే వసుంధర కొడుకు అయిన వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేష్ బాబు) ఒక పేపర్ పై సంతకం పెట్టాలి. చిన్నప్పుడే కొడుకుని వదిలేసి, రెండో పెళ్లి చేసుకున్న తల్లి అంటే కోపం ఉన్న రమణ… ఆ పేపర్లపై సంతకం పెట్టాడా? కాట మధు నుంచి తల్లికి తాతయ్యకి వచ్చిన సమస్యని తీర్చడా లేదా అనేదే గుంటూరు కారం కథ. సింపుల్ గా ఇదే కథ అయినా కూడా లోపల చాలా ప్రశ్నలు ఉన్నాయి. వసుంధర మొదటి భర్త జయరామ్ ఎందుకు జైలుకి వెళ్లాడు? రమణని వసుంధర ఎందుకు వదిలేసింది? గుంటూరు మిర్చి యార్డులో రమణ రౌడీయిజం చేస్తూ ఉండడం… అమ్ముతో ప్రేమ ఎలా మొదలయ్యింది… ఇలా అనేక ప్రశ్నలతో గుంటూరు కారం సినిమాని నడిపించాడు త్రివిక్రమ్.

విశ్లేషణ:

నటీ నటుల విషయానికి వస్తే… గుంటూరు కారం సినిమా పూర్తిగా మహేష్ బాబు వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇంట్రడక్షన్ నుంచి ప్రతి ఫ్రేమ్ లో మహేష్ చాలా అందంగా ఉన్నాడు. సినిమాని తన భుజాలపైన మోసిన మహేష్ బాబు… చాలా ఓపెన్ అయ్యి పెర్ఫార్మ్ చేసాడు. డైలాగ్ డెలివరీలో మహేష్ బాబు ఖలేజాలోని అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ని గుర్తు చేస్తాడు. ఆయన కామెడీ టైమింగ్ కి మూవీ లవర్స్ ఫిదా అవ్వాల్సిందే. కామెడీ, ఎమోషన్స్, డాన్స్… ఇలా అన్ని ఎలిమెంట్స్ లో మహేష్ బాబు ది బెస్ట్ ఇచ్చాడు. హీరోయిన్స్ విషయానికి వస్తే త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ ని ఉండే ఇంపార్టెన్స్ అంతంత మాత్రమే… ఇదే మరోసారి గుంటూరు కారం సినిమాతో నిజమయ్యింది. శ్రీలీల, మీనాక్షి చౌదరిలు స్క్రీన్ పైన గ్లామర్ అండ్ సాంగ్స్ కోసమే ఉన్నారేమో అనిపించకమానదు. విజయశాంతి, రావు రమేష్, జయరామ్, ప్రకాష్ రాజ్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు కానీ మహేష్ ముందు నిలబడే పాత్ర సినిమాలో ఒక్కటి కూడా కనిపించదు. ఇక క్రూ విషయానికి వస్తే త్రివిక్రమ్ సింపుల్ స్టోరీ లైన్ తో గుంటూరు కారం సినిమాని తెరకెక్కించాడు. మహేష్ తో చేయాల్సిన స్థాయి కథ కాదు, ఆయన స్థాయి రచన డైలాగుల్లో వినిపించదు. కథని ఇంకాస్త బలంగా రాసుకోని ఉంటే బాగుండు. అక్కడక్కడ త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది కానీ పూర్తి స్థాయిలో సాటిస్ఫై చెయ్యదు. ఇదే గుంటూరు కారం సినిమాకి అతి పెద్ద మైనస్. థమన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొదటి నుంచి గుంటూరు కారం సినిమాకి ఉన్న సమస్య మ్యూజికే.. ఇదే సినిమాలో కూడా కనిపిస్తుంది. ఇతర టెక్నీకల్ టీమ్ కూడా స్టాండ్ అవుట్ అయ్యే వర్క్ చేయలేదు. అందరూ కలిసి ఒక ఘాటు తక్కువ ఉన్న గుంటూరు కారం ఆడియన్స్ కి రుచి చూపించారు.

ఫైనల్ పాయింట్: మహేష్ బాబు వన్ మ్యాన్ షో