రివ్యూ: జై శ్రీరామ్

Jai-SriRam-Review

Telugu Mirchi Rating : 1.75/5 | Click here for English Review

 

రివ్యూ:

 

అయ్యో.. రామచంద్రా.. జై శ్రీరామ్ !

సినిమా తీయ‌డానికీ, చూడ్డానికీ ఓ బ‌ల‌మైన ఎలిమెంట్ దోహ‌దం చేయాలి. అర‌వై స‌న్నివేశాలుంటే.. అందులో ప‌దైనా వారెవా అనిపించేలా ఉండాలి. లేదంటే కోట్లు పెట్టి సినిమా తీయ‌డం ఎందుకు? రెండు గంట‌లు వెచ్చించి ఆ రొద‌ను భ‌రించ‌డం ఎందుకు? హీరో కాల్షీట్లు, కావ‌ల్పినంత డ‌బ్బు.. ఉంటే సినిమా తీసేయొచ్చేమోగానీ… ప్రేక్షకుల్ని  థియేట‌ర్‌లో కూర్చోబెట్టాలంటే మాత్రం ఆ సినిమాలో ద‌మ్ముండాలి. లేదంటే ఇదేం సినిమా రా బాబూ…. అని ప్రేక్షకులు థియేట‌ర్‌లోనే త‌ల‌లు బాదుకోవాల్సి ఉంటుంది. ఈ లక్షణాలన్ని  ఉన్న చిత్రం ఒకటి ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. అదే… జై శ్రీ‌రామ్‌……

శ్రీ‌రామ్ (ఉద‌య్ కిర‌ణ్‌))  ఓ నిజాయ‌తీ ఉన్న పోలీస్ ఆఫీస‌ర్‌.. సంఘ విద్రోహ శ‌క్తుల‌ను ఏరిపారేస్తుంటాడు. చింతామ‌ణి ( గౌతంరాజు) ఓ అనాథ శ‌ర‌ణాల‌యం స్థాపించి… ప్రజలకు సేవ చేసే నెపంతో వారి అవ‌య‌వాల‌తో వ్యాపారం చేస్తుంటాడు. వీటికి సంబంధించిన సాక్ష్యాలు సేక‌రిస్తాడు శ్రీ‌రామ్‌.. అయితే…. పై అధికారుల నుంచి స‌హ‌కారం లేక‌పోవ‌డంతో వారిని ఏమీ చేయలేడు. చింతామ‌ణి ప‌న్నిన కుట్ర వ‌ల్ల శ్రీ‌రామ్ త‌న కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోతాడు. ఓసారి చింతామ‌ణి మ‌నుషులు శ్రీ‌రామ్‌పై దాడిచేసి ఓ చోట బంధిస్తారు. రెండేళ్ల పాటు ఇరుకు గ‌దిలోనే ఉండిపోవ‌ల్సి వ‌స్తుంది. ఆ త‌ర‌వాత బ‌య‌ట‌కు వ‌చ్చినా చేతిలో ఉద్యోగం ఉండ‌దు. మ‌రోవైపు ఒంట‌రి జీవితం. ఈలోగా అత‌నికి ఓ ఫోన్ వ‌స్తుంది. ఓ అగంత‌కుడు.. శ్రీ‌రామ్‌కి కావ‌ల్సిన వివ‌రాలు ఇస్తుంటాడు. శ్రీ‌రామ్‌ని ఆదుకొంటాడు. త‌న శ‌త్రువుల‌ను ఒకొక్కరినీ  మట్టుబెట్టడానికి  ఫోన్ నుంచే సూచ‌న‌లు ఇస్తుంటాడు. ఇంత‌కీ ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎవ‌రు? శ్రీ‌రామ్ త‌న ప‌గ‌ను ఎలా తీర్చుకొన్నాడు? చింతామ‌ణి గ్యాంగ్‌ని ఎలా తుద‌ముట్టించాడు? అనేదే ఈ సినిమా క‌థ‌..

ఇప్పటి వ‌ర‌కూ ఉద‌య్ కిర‌ణ్‌ని ప్రేమక‌థ‌ల్లో చూశాం. తొలిసారి అత‌నిని యాక్షన్ క‌థ‌లో దింపాడు దర్శకుడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా కంటికి ఇంపుగా క‌నిపించాల‌ని బాడీని పెంచాడు గానీ… ఆ గెట‌ప్‌లో ఉద‌య్‌కిర‌ణ్‌ని అసలు చూళ్లేం. అస‌లు దర్శకుడు  ఉద‌య్‌కిర‌ణ్ కోసం ఈ క‌థ (అస‌లు క‌థ ఉందా?) రాసుకొని ఉండ‌డు. ఎవ‌రూ ఒప్పుకోక‌పోతే.. ఉద‌య్ కిర‌ణ్‌తో లాగించేసి ఉంటాడు. జుత్తు కుర‌చ‌గా క‌త్తిరించి, మేక‌ప్ లేకుండా న‌టిస్తే… యాక్షన్ లుక్ వ‌చ్చేస్తుంద‌ని ఉద‌య్ భ్రమపడి  ఉంటాడు. శ్రీ‌రామ్ పాత్రలో సూట్ కాలేక‌పోయాడు. ఉద‌య్ కిర‌ణ్ సీరియ‌స్‌గా డైలాగులు చెబుతోంటే న‌వ్వొస్తుంది.  యాక్షన్ క‌థ‌ల్లో రాణించాలి అనే ఆలోచ‌న మంచిదే. కానీ.. ప‌క్కా ప్లానింగ్‌తో, మంచి క‌థ‌తో ముందుకు రావాలి. కానీ ఈ యువ హీరో ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. పోరాట‌ల విభాగంలో కష్టపడినా… చేసింది ఉద‌య్ కిర‌ణ్ కాబ‌ట్టి అవ‌న్నీ తేలిపోయాయి. రేష్మని హీరోయిన్ అని చెప్పలేం. ఓ క్యారెక్ట‌ర్ చేసిందంతే. సినిమా మొత్తం క‌నిపించినా ఆ పాత్ర వ‌ల్ల క‌థ‌కు ఒరిగిందేం లేదు. త‌ను చెప్పే ల‌వ్‌స్టోరీ… స‌న్నివేశాలు పెంచుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డింది త‌ప్ప‌……. దాని వ‌ల్ల క‌థ‌కు  ఒరిగిన ప్రయోజనం  ఏమీ లేదు. గౌత‌మ్ రాజుని ఇంత‌కు ముందెప్పుడూ చూడ‌ని పాత్రలో  చూస్తాం. దారుణమైన మేక‌ప్ వేసి… విల‌నిజం పండిద్దాం అనుకొని దర్శకుడు భంగ‌ప‌డ్డాడు.. ప్రేక్షకులను  భ‌య‌పెట్టాడు. మిగ‌తావారి గురించి ఎంత త‌క్కువ చెప్పుకొంటే అంత మంచిది.

అస‌లు దర్శకుడు ఏ  పాత్రనూ  స‌రిగా ప్రజెంట్ చేయలేకపోయాడు. ఆఖ‌రికి ఉద‌య్‌కిర‌ణ్‌ని కూడా. ఈ సినిమాలో అత‌నికి పాట లేదు. ఫ‌స్టాఫ్‌లో క‌నీసం మాట‌లు కూడా లేవు. ఫోన్‌లో ఎవ‌రో… చెబుతుంటే క‌థానాయ‌కుడు ఒకొక్కరినీ చంపుకొంటూ పోవ‌డం ఏమిటో అర్థం కాదు. పైగా ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ అయ్యిండి. వినోదానికి ఈ క‌థ‌లో స్కోప్ లేదు. యాక్షన్ పేరుతో ఫైట్లూ, సంగీత దర్శకుడికి డ‌బ్బులిచ్చాం క‌దా అని పాట‌లూ వ‌చ్చిప‌డిపోతుంటాయి. ఇక సాంకేతిక వ‌ర్గం విభాగానికొస్తే… అన్ని పాట‌లున్నా అందులో  ఒక్కటీ చెవుల‌కు చేర‌దు. స్ర్కీన్‌ప్లే ప‌రంగా దర్శకుడు  చాలా త‌ప్పులు చేశాడు. ఎడిటింగ్ బాధ్యతా ఆయ‌నిదే. కంటిన్యుటి దెబ్బతీసింది .

ఉద‌య్ కిర‌ణ్‌లాంటి చాక్లెట్ ఫేసుల‌కు… గ‌న్‌లు చేతికి అందిస్తే.. ఫ‌న్నీగా ఉంటుంది. క‌నీసం ఈ సినిమాలో ఆ ఫ‌న్‌నీ ఎంజాయ్ చేయ‌లేం. ఈ సినిమాలో ఓ పాట ఉంది. అందులో… అత‌ని గ‌మ్యం.. చివ‌రికి శూన్యం అంటూ అర్థం ప‌ర్థం లేని ప‌ద ప్రయోగం  చేశారు. ఈ సినిమా విష‌యంలో మాత్రం… ఆ అర్థం లేని ప‌ద‌మే స‌రైన‌ది అనిపించింది. ఉద‌య్ కిర‌ణ్ ఎంత కష్టపడినా ఫ‌లితం మాత్రం శూన్యమే.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 1.75/5                                          – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version