రివ్యూ : ప‌విత్ర

pavithra-pavitra-telugu-movie-review-rating

తెలుగుమిర్చి రేటింగ్‌ :  3/5 | Click here for English Review

మెచ్చుకోదగ్గ ప్రయత్నం… 

ముళ్లదారిలో న‌డుస్తున్నవారిని చూసి బాధ ప‌డ‌కూడ‌దు, అయ్యో అని .. జాలి ప‌డ‌కూడ‌దు. ఎందుకంటే… ఆ దారిలోని ముళ్లు ఏరి – ర‌హ‌దారిగా మార్చేది వాళ్లే. జనార్థన మ‌హ‌ర్షి కూడా ఓ వేశ్య క‌థ అనే ఓ ముళ్ల బాట ఎంచుకొన్నాడు. క‌న్నీళ్లు, క‌ష్టాలూ అనే ముళ్లు ఏరుకొంటూ వెళ్లి – ఓ స‌మ‌స్యకు ప‌రిష్కార `మార్గం` క‌నిపెట్టేందుకు త‌న వంతు ప్రయ‌త్నం చేశాడు. అదే… ప‌విత్ర‌! ఇదో మేడి పండులాంటి సినిమా. శ్రియ రంగుల ఫొటోల‌తో పోస్టరు త‌ళ‌త‌ళ‌లాడిపోతున్నా… లోప‌ల పురుగుల్లాంటి చేదు నిజాలున్నాయి. ఒక‌టా..రెండా..? వంద‌లూ, వేలు. పేషెంట్లను ఫీజుల రూపంలో పీక్కుతినే డాక్టర్లు, న‌మ్మకాల‌తో ఆడుకొనే బాబాలూ, దేశాన్ని ముక్కలుగా చేసుకొని మిఠాయిల్లా తినే రాజ‌కీయ నాయ‌కులు… ఇలా ఎంద‌రో! వాట‌న్నింటిని  ఎదుర్కొన్న ఓ వేశ్య క‌థ‌. మ‌రి దీన్ని ఎలా తీర్చిదిద్దాడు? అస‌లు ప‌విత్ర క‌థేంటి?

పవిత్ర (శ్రియ‌) ఓ వేశ్య‌. అమ్మా,నాన్న లేరు. త‌న మేన‌మావ (ఏవీఎస్‌) ఒక్కడే ఆమెకున్న అండ‌. ఒక్క రాత్రికి ఆమె ఖ‌రీదు ల‌క్ష రూపాయ‌లు. త‌ను వేశ్యగా మార‌డానికి ఓ కార‌ణం ఉంటుంది. చావు బ్రతుకుల మ‌ధ్య ఉన్న త‌న త‌ల్లిని కాపాడుకోవ‌డానికి ఆమె ఈ వృత్తిలోకి దిగుతుంది. శ‌రీరాన్ని తాక‌ట్టు పెట్టి డ‌బ్బులు సంపాదిస్తుంది. అయినా… ఆమె ప్రాణాల‌ను కాపాడ‌లేక‌పోతుంది. మరో అమ్మాయి బ‌తుకు త‌న‌లా కాకూడ‌ద‌నే సదుద్దేశ్యంతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది. నిరుపేద రోగుల‌కు ఉచితంగా చికిత్స అందజేస్తుంది.శివ (శివాజీ) అనే ఓ ఫొటోగ్రాఫ‌ర్ మాయ‌లో కొంత‌మంది అమ్మాయిలు చిక్కుకొంటారు. శివ వారిని శారీర‌కంగా లొంగ దీసుకొని.. ఆ రాస‌లీల‌లు రికార్డు చేస్తాడు. ఆ త‌ర‌వాత వారిని బ్లాక్ మెయిల్ చేయ‌డం, డ‌బ్బు గుంజ‌డం – ఇదీ వాడి ప‌ని. శివ అకృత్యాలు త‌ట్టుకోలేక ఓ అమ్మాయి ఆత్మహ‌త్యా ప్రయ‌త్నం చేస్తుంది. ఆ అమ్మాయిని.. ప‌విత్ర కాపాడుతుంది. శివని ట్రాప్ చేసి అత‌ని ద‌గ్గర నుంచి తిరిగి డ‌బ్బులు వ‌సూలు చేసి – ఆ అమ్మాయిల‌కు న్యాయం చేస్తుంది. అంతే కాదు.. శివ‌ని క‌ట‌క‌టాల వెన‌క్కి పంపిస్తుంది. మ‌రోవైపు ఎమ్మెల్మే (సాయికుమార్‌) కొడుకు అభి (కౌశిక్‌) ప‌విత్రని ప్రేమిస్తాడు. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితిలో ఆ ఎమ్మెల్మే కొడుకు పెళ్లికి ఒప్పుకొంటాడు. అయితే ఈ పెళ్లి.. త‌న రాజ‌కీయ భ‌విష్యత్తుకు పునాదిగా చేసుకోవాల‌నుకొంటాడు. అంతేకాదు.. కొడుకునీ, కోడ‌ల్ని కాటికి పంపించి ఆ సానుభూతి ఓట్లతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని ప్లాన్ వేస్తాడు. ఈ కుట్రని ప‌విత్ర ఎలా చేధించింది? అసెంబ్లీలోకి ఎలా అడుగుపెట్టింది? అనేదే ఈ సినిమా క‌థ‌.

వేశ్య క‌థ‌ని ఇతివృత్తంగా చేసుకొని చాలా సినిమాలొచ్చాయి. మ‌హామ‌హులైన ద‌ర్శకులు ఈ క‌థ‌ల్ని టేక‌ప్ చేశారు. అవ‌న్నీ వేశ్య జీవితాల్లోని డార్క్‌షేడ్‌నే చూపించాయి. ఎప్పుడూ వాళ్ల స్వీయ క‌ష్టాలూ, క‌న్నీళ్లు మాత్రమే చూపించారు. ఈ సినిమా మాత్రం క‌ల‌ర్‌ఫుల్‌గా సాగింది. త‌న‌లా మ‌రో ప‌విత్రమైన ఆశ‌యం క‌నిపించింది. అందుకే… వేశ్య కూడా ప‌విత్ర అయ్యింది. సాయికుమార్ – శ్రియ‌, ర‌విబాబు – శ్రియ మ‌ధ్యలో న‌డిపిన డ్రామా, సంభాష‌ణ‌లూ ఈ సినిమా డెప్తు చూపిస్తాయి. ఒక విధంగా ఈ సినిమాకి బ‌ల‌మైన టేకాఫ్ ఇచ్చాయి. శివాజీ-శ్రియ‌ల మ‌ధ్య న‌డిపిన లాప్‌టాప్ ఎపిసోడ్ – ర‌స‌వ‌త్తరంగా తీర్చిదిద్దారు. దాంతో తొలిభాగం ఎలాంటి కుదుపూ లేకుండా సాగిపోతుంది. ఆ త‌ర‌వాత ప‌విత్ర పెళ్లి, రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టడం – చివ‌ర్లో రాజ‌కీయ నాయకుల‌ను కడిగేసి ఓ స్పీచ్ దంచికొట్టడంతో శుభం కార్డు వేసుకొంటుంది.

చాలాకాలం త‌ర‌వాత శ్రియ చాలా అందంగా క‌నిపించింది. ప‌విత్ర పాత్రలో అల్లుకుపోయింది. పెళ్లికి ముందు, ఆ త‌ర‌వాత ఓ అమ్మాయి బాడీ లాంగ్వేజీలో చాలా మార్పులొస్తాయి. ఎంత వేశ్య అయినా అమ్మాయే క‌దా..? అందుకే ప‌విత్రలోనూ ఆ మార్పు చూపించారు. అక్కడే శ్రియ అనుభ‌వం ఉప‌యోగ‌ప‌డింది. ప‌దునైన సంభాష‌ణ‌లు ప‌లికేట‌ప్పుడు శ్రియ‌లోని హీరోయిజం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొత్తమ్మీద శ్రియ కెరీర్‌లో ప‌విత్ర ఓ మైల్‌స్టోన్ కాక‌పోయినా – చాలా కాలం గుర్తుండిపోయే పాత్ర అవుతుంది.

ప్రస్థానం త‌ర‌వాత సాయికుమార్‌కి ఆ రేంజు పాత్ర ఇది. ఇందులోనూ త‌న స్వార్థం చూసుకొనే మ‌నిషే! సాయి వాయిస్‌కి మ‌రోసారి స‌లామ్ కొట్టొచ్చు. ప‌విత్ర మేన‌మామ‌గా ఏవీఎస్ క‌నిపించారు. ఇంత సెటిల్డ్‌గా ఆయ‌న్ని ఇంత‌కు ముందెప్పుడూ చూడ‌లేదు . ఎప్పుడూ తెర‌మీద అల్లరి చేసి, ఇప్పుడు హుందాగా క‌నిపించ‌డం ఆ పాత్రకీ ఓ ఔచిత్యం తీసుకొచ్చింది. ఏవీఎస్ గొంతు కూడా చాలా గంభీరంగా వినిపిస్తుందీ సినిమాలో. రోజాకి మాట‌ల్లేవ్‌. అయినా ట‌చ్ చేసే పాత్రే. కొత్తబ్బాయి చింటూ ( అవును ఫేమ్‌) హుషారుగా క‌నిపించాడు. మంచి `హైటు`న్న పాత్ర‌! ఉన్నవారంతా మంచి న‌టులే కాబ‌ట్టి – ఆ విష‌యంలో వంక పెట్టలేం.

జ‌నార్థన మ‌హ‌ర్షిలోని ర‌చ‌యిత‌, ద‌ర్శకుడూ ఇద్దరూ ఈ సినిమా కోసం పోటీ ప‌డ్డారు. అయితే ఎక్కువ మార్కులు ర‌చ‌యిత‌గానే ద‌క్కించుకొంటాడు. ఎన్ని మాట‌ల తూటాలో. చెర్నకోలుతో ఛ‌ల్ ఛ‌ల్ అంటూ కొడుతూనే ఉంటాడు.

నేను నా దేహాన్ని మాత్రమే అమ్ముతున్నా.. మీరు ఏకంగా దేశాన్ని అమ్మేస్తున్నారు..

ఈ దేశంలో ప్రాంతాన్ని కాపాడుకోవ‌డానికీ, భాష‌ల్ని కాపాడుకోవడానికీ, కులాల‌ను కాపాడుకోవ‌డానికి మంత్రులున్నారు, కానీ మ‌నుషుల్నికాపాడ‌డానికి మాత్రం లేరు.. – ఈ ప్రశ్నల‌కు స‌మాధానం ఎవ‌రిస్తారు..?

అమ్మాయిల‌పై జ‌రుగుతున్న అన్యాయాలు ఆపాలంటే కొవ్వొత్తులు ప‌ట్టుకొని తిరిగితే స‌రిపోవు – కర్రలు ప‌ట్టుకోవాలి.. అని చెప్పడం మ‌హ‌ర్షిలోని ర‌గులుతున్న ఆవేశానికి మ‌చ్చుతున‌క‌. ద‌ర్శకుడిగా డ‌ల్ అయిన‌ప్పుడ‌ల్లా – ర‌చ‌యిత క‌వ‌ర్ చేసేశాడు. దాంతో కొన్ని లొటు పాట్లు మాయ‌మైపోయాయి.

అలాగ‌ని లోపాలు లేవ‌ని కాదు. ఎన్నో చెప్పాలి అనే గంద‌ర‌గోళంలో మ‌హ‌ర్షి త‌డ‌బ‌డ్డాడు. శివాజీ ఎపిసోడ్ ఓ సినిమా, ఆ త‌ర‌వాత న‌డిచేది మ‌రో సినిమా అనిపిస్తుంది. ప‌విత్ర ఫ్లాష్‌బ్యాక్ బ్రహ్మానందం ముందు రివీల్ చేయ‌డం బాలేదు. అంతెందుకు..? బ్రహ్మానందం పాత్ర అవ‌స‌ర‌మే లేదు. ప‌విత్ర రాజకీయాల్లోకి రావ‌డానికి నిర్ణయం తీసుకోవ‌డం, గెల‌వ‌డం…ఇవ‌న్నీ చ‌క‌చ‌క సాగిపోతాయి. లాజిక్‌ల‌కు అంద‌కుండా సాగిపోతాయి. రోజా పాత్ర రియ‌లైజ్ అవ్వడం వెనుక కూడా స‌రైన కార‌ణం చూపించ‌లేదు. సాయికుమార్ పాత్ర ఎగ్జిట్ అయిన‌ప్పుడే సినిమా అయిపోయింది. ఎందుకంటే అస‌లు పోటీ సాయికీ ప‌విత్రకే! పోటీదారుడు లేన‌ప్పుడు ఆట‌లో మ‌జా ఎక్కడిది? స్వామీజీ నిజ స్వరూపం బ‌య‌ట పెట్టడం కూడా సిల్లీగా ఉంది.

శ్రీ‌లేఖ పాట‌లు థియేట‌ర్లో విన‌డానికి బాగానే ఉన్నా – మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకొనేలా లేవు. ఆర్‌. ఆర్‌. అంతంత మాత్రమే.
ఈ లోపాలు మిన‌హాయించ‌గ‌లిగితే జ‌నార్థన మ‌హర్షి బోల్డ్‌గా చేసిన ప్రయ‌త్నం అభినందించ‌ద‌గిన‌దే. ఈ స‌మాజానికి కొన్ని ప్రశ్నలు వ‌దిలారాయ‌న‌. వేశ్య క‌థ అంటే ఇప్పటి వ‌ర‌కూ ఒక్క కోణంలోనే సాగింది. అందులోని మ‌రో కోణం బ‌య‌ట‌కు తీసుకురాగ‌లిగారు.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3/5 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 

Click here for English Version