రివ్యూ : ప్రేమ కథా చిత్రమ్

Prema-Katha-Kadha-Chitram-telugu-movie-review-rating

తెలుగుమిర్చి రేటింగ్‌ :  3.25/5 | Click here for English Review

మరో నవ్వుల దెయ్యం సినిమా :

హర్రర్, థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే ఇలాగే తీయాలని, సినిమాలు జనాలు ఏనాడో రాజ్యాంగం రాసి పెట్టేశారు. ఆ పడికట్టు పట్టాల మీదనే ఎవరు తీసినా. అందువల్లనే ఈ తరహా సినిమాలకు, వాటిని ఇష్టపడేవారు తప్ప, మిగిలిన
ప్రేక్షకులు అంతగా రారు. తొలిసారి ఫన్ లో హర్రర్ మిక్స్ చేసి కొత్త ప్రయోగాన్ని విజయవంతంగా చేశాడు. దర్శకుడు ప్రభాకర్ రెడ్డి.

కేవలం నాలుగే నాలుగు పాత్రలతో, కేవలం ఒకే లొకేషన్ లో తీసిన సినిమా ప్రేమాకథాచిత్రమ్. వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఓ గెస్ట్ హౌస్ కు చేరుతారు సుధీర్ (సుధీర్ బాబు), నందిత (నందిత), ప్రవీణ్ (ప్రవీణ్), సప్తగిరి. అయితే ఏవో ఒక కారణాలతో ప్రవీణ్ ఆత్మహత్యల కార్యక్రమాన్ని మూడు రోజులు వాయిదా వేయించి, సుధీర్, నందిత ఒకరికొకరు దగ్గరయ్యేలా చేస్తాడు. అదే సమయంలో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. సినిమా హర్రర్ టర్న్ తీసుకుంటుంది. అలా మలుపు తిరిగిన సినిమా చివరకు ఎలా ముగిసిందన్నది మిగిలిన కథ.

సాధారణంగా హర్రర్ సినిమాలు అంటే క్షుద్రపూజలు, చీకటి గదులు, భయంకరమైన రీరికార్డింగ్ అలవాటైపోయింది. కానీ ఈ సినిమా ఆద్యంతం ఈ పడికట్టు సూత్రాలకు భిన్నంగా నడుస్తుంది. హర్రర్ లో కామెడీని కాకుండా, ఫన్ లో భయాన్ని మిక్స్ చేయడం ఈ సినిమా ప్రథాన సూత్రం. దెయ్యం అనేది ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో ప్రేక్షకులకు ముందే తెలుస్తుంది. అయినా కూడా ఉత్కంఠను నిలబెట్టడంలో స్ర్కిప్ట్ విజయం సాధించింది. అదే సమయంలో సన్నివేశాలను కాస్త కొత్తగా రాసుకోవడం బాగుంది. డైలాగ్ కామెడీ బాగానే పండినా, వెనకటి గుణమేల మాను అన్న చందంగా ఒక్క రెండు మూడు శాతం డైలాగులతో మళ్లీ కాస్త బస్ స్టాప్, ఈరోజుల్లో గుర్తు చేశాడు. నడుస్తున్న ట్రెండ్ ప్రకారం వాటిని వదిలేసి పక్కన పెడితే, మాత్రం రెండు గంటలపాటు మాంచి ఎంటర్ టైన్ మెంట్ లభించినట్లే. దెయ్యం సినిమాలకు లాజిక్ లు ఎలాగూ వుండవుకాబట్టి, క్లయిమాక్స్ ఇలాగే ఎందుకు అని అనుకోనక్కర్లేదు. ఎలాగోలా ముగించాలి కదా. సినిమా ప్రథమార్థ షార్ప్ గా మాంచి ట్విస్ట్ తో ముగిసింది. ద్వితీయార్థం కొద్దిగా.. సాగుతున్నట్లు అనిపిస్తు తరుణంలో, క్లయిమాక్స్ వచ్చి ఆదుకుంటుంది. నిజానికి రెండో సగంలో ప్రవేశపెట్టిన రీమిక్స్ (వెన్నెలైనా చీకటైనా) పాట లేకున్నా ఫరవాలేదు. అయితే మరీ హర్రర్ సినిమాగా మిగిలిపోకూడదన్న దర్శకుడి ఆలోచన ప్రకారం ఆ పాట పెట్టి వుంటారు.

సినిమాకు హీరోయిన్, ఫొటోగ్రఫీ, రీరికార్డింగ్ ప్లస్ పాయింట్లు. దర్శకుడు, సినిమాటోగ్రఫర్ (ప్రభాకర్ రెడ్డి) ఒకరే కావడంతో చిత్రీకరణపై మాంచి శ్రద్ధ పెట్టారు. హర్రర్ సినిమాల్లో కనిపించే చీకటి, విపరీతమైన కెమెరా కదలికలు లేకపోవడం బాగుంది. పైగా రీరికార్డింగ్ కూడా శబ్దకాలుష్యం లేకుండా సాగింది. కథానాయికకు ఇది రెండో సినిమా. కానీ పాత్ర చూస్తే విక్రమ్ పోషించిన అపరిచితుడు లాంటి పాత్ర. అంత రేంజ్ కాకున్నా, అదే తీరు. కానీ చాలా అనుభవంతో నందిత ఆ పాత్రను పోషించిన విదానాన్ని మెచ్చుకోవాలి. వాస్తవం చెప్పాలంటే, ఆ అమ్మాయి నటన ముందు సుధీర్ బాబు నటన కొంచెం తేలిపోయింది. భయపెట్టే రేంజ్ లో భయం ఫీలింగ్స్, ఆందోళన అతగాడు అంతలా కనబర్చలేదు. అయితే ప్రవీణ్, సప్తగిరి తమ కామెడీ, డైలాగ్ టైమింగ్ తో సినిమాను చకచకా సాగిపోయేలా చేశారు. జెబి సంగీతంలో ఒక పాట రీమిక్స్. మరోపాట ఇటీవల వచ్చిన గజరాజులో ట్యూన్ తో ఇన్ స్పైరై చేసినట్లుంది. మొత్తం మీద రెండు గంటల కాలక్షేపానికి లోటు రానివ్వని సినిమా..ప్రేమాకథాచిత్రమ్.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3.25/5 – మాధురి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 

Click here for English Version