మాపై వ‌చ్చిన ఆరోపణల్లో నిజం లేదు : జీవితా రాజశేఖర్‌


గరుడ వేగ’ సినిమా విషయంలో జీవితా రాజశేఖర్‌ తమను మోసం చేశారని జోస్టార్స్‌ ప్రొడక్షన్స్‌కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా జీవిత స్పందించారు. శనివారం ఏర్పాటు చేసిన ‘శేఖర్‌’ సినిమా ప్రెస్‌మీట్‌లో జీవిత మాట్లాడుతూ ‘‘మాపై వచ్చిన ఆరోపణల కేసు ప్రాపెసింగ్‌లో ఉంది. నగరి నుంచి సమన్లు వచ్చి రెండు నెలలు అవుతుంది. అవి మాకు కొంద‌రు అడ్డుకున్నారు. రెండు నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు ఉంటే ఒప్పుకుంటా. లేదంటే దేవుణ్ణి కూడా ధైర్యంగా నిలదీస్తా. మాపై ఆరోపణలు చేసినవారు ఉత్తములు కాదు. వాళ్ల వల్ల మా మేనేజర్‌తోపాటు చాలామంది ఇబ్బందులు పడ్డారు. కోర్టులో కేసు నడుస్తోంది. ఏది నిజమో కోర్టు చెబుతుంది. కాబట్టి నేను పెద్దగా ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. మా పరువు తీయాలని చూస్తే ఊరుకోం. మేము ఏ తప్పు చేయలేదు కోర్ట్ ఏ తీర్పు చెప్పినా ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉన్నాం తెలిపారు.

ఈ సంద‌ర్భంగా సోష‌ల్‌మీడియాలో వ‌స్తున్న తంబ్‌లైన్‌పైనా చుర‌క‌లు వేశారు. ఒక‌ప్పుడు `మా` ఎల‌క్ష‌న్ సంద‌ర్భంగా మా కుటుంబం పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇలా ప‌లు సంద‌ర్భాల్లో మ‌మ్మ‌ల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావ‌డంలేదు. మా మీద కొందరు పని కట్టుకుని తప్పుడు భావన కలిగేలా సోషల్ మీడియాలో థంబ్ లైన్స్ పెడుతున్నారు. అదేవిధంగా నిహారిక, మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి కూడా చాలా దారుణమైన వార్తలను ట్రోల్ చేస్తున్నారని, తమ కుమార్తెల గురించి రకరకాల వార్తలను రాశారని అవన్నీ మానసికంగా ఎంతో బాధకు గురిచేస్తున్నాయని జీవిత అన్నారు పాజిటివ్ థింకింగ్‌తో తాను ముందుకు పోతానని, తామంటే నచ్చని వారెవరో వెనక నుండి ఇలాంటి పనులు చేస్తుంటారని ఆమె చెప్పారు.

‘శేఖర్’ నిర్మాత శ్రీనివాస్
2017లోనే కోటేశ్వరరాజు మీద డీమానుటైజేషన్ కేసు ఉందని, పోలీసుల కళ్ళు గప్పి ఆయన తిరుగుతున్నారని ‘శేఖర్’ నిర్మాత శ్రీనివాస్ చెప్పారు. అసలు రూ.26 కోట్లు ఆయన ఎక్కడ నుండి తెచ్చి ఇచ్చారో కోటేశ్వరరాజు నిరూపించుకోవాల్సి ఉంటుందని శ్రీనివాస్ అన్నారు. జీవితకు- కోటేశ్వరరాజుకు మధ్య ఉన్న వివాదంలోకి తమ ఫైనాన్షియర్ బీరం సుధాకర్ రెడ్డి పేరు తీసుకురావడం దారుణమని చెప్పారు.