రివ్యూ : రామాచారి

ramachari-telugu-movie-review-rating

రామాచారి రివ్యూ – ఈడో పెద్ద డ్రామాచారి రామాచారి!

న‌వ్వించేస్తే.. జ‌నాలు చూసేస్తారు.. అనేది సినీ జ‌నాల న‌మ్మకం. అది చాలా వ‌ర‌కూ క‌రెక్టే! ఈ ఫైట్లూ, ఫీట్లూ రివైంజు స్టోరీలూ చూసి చూసి అల‌సి పోయారు. కాసేపు న‌వ్వించే సినిమా కోసం వెయిట్ చేసీ చేసీ వెయిట్ కూడా బాగా పెరిగిపోయారు. కాక‌పోతే ఆ న‌వ్వుల్లో కుసింత క్వాలిటీ కావాలి. అంటే పాత ఎస్మెమ్మెస్ జోకులు, మూస బూతు జోకులూ కాకుండా.. హాయిగా ఉండాల‌న్నమాట‌. లాజిక్ లేక‌పోయినా ఫర్లేదు. కిత‌కితలు పెట్టుకోకుండా న‌వ్వుకోవ‌చ్చు.. అనే ధీమా ఇస్తే చాలు! మ‌రి ఫుల్లు కామెడీ సినిమా.. అని గొప్పగా చెప్పుకొని బాక్సాఫీసు ముందుకొచ్చిన ‘రామాచారి’లో ఆ న‌వ్వులున్నాయా? లేదంటే రామాచారే.. న‌వ్వుల పాల‌య్యాడా..? ఓ సారి చూసొద్దాం రండి!

అన‌గ‌న‌గా.. ఓ రామాచారి (వేణు). అత‌నికి పోలీస్ కావాల‌నేది ల‌క్ష్యం. అందుకోసం క‌ష్టప‌డుతూ ఉంటాడు. మ‌రోప‌క్క రాష్ట్ర్ర ముఖ్యమంతి హ‌రిశ్చంద్రప్రసాద్ (బాల‌య్య‌)ని హ‌త్య చేయ‌డానికి ఓ భాయ్‌.. జైల్లో కూర్చునే ప్లాన్ చేస్తాడు. ఆ కుట్రల‌న్నీ వేణు.. త‌న‌కు తెలీయ‌కుండానే భ‌గ్నం చేస్తుంటాడు. ఈ కుట్రలో క‌మీష‌న‌ర్ చ‌డ్డ (ముర‌ళీ శ‌ర్మ‌)కీ భాగ‌స్వామ్యం ఉంటుంది. త‌న ప్లాన్స్ అన్నీ తిప్పి కొడుతున్నాడ‌ని రామాచారిపై క‌క్ష్య పెంచుకొంటుంటాడు. చారి పోలీస్ కాకుండా.. అడ్డుప‌డ‌తాడు. ముఖ్యమంత్రిని కాపాడ‌డానికి నువ్వేమైనా హీరోవా?? అని ఎగ‌తాళి చేస్తాడు. దాన్ని మ‌న‌సులో పెట్టుకొని.. హీరోగా ఎదిగే ప్రయ‌త్నం చేస్తాడు. చారి అండ్ కో.. అనే గుఢాచారి సంస్థను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిని హ‌త్య చేసే ముఠా ఆచూకీ క‌నుక్కొనేందుకు రంగంలో దిగుతాడు. ఆ త‌ర‌వాత ఏమైంది? చారి హీరోగా ఎదిగాడా? ముఖ్యమంత్రిని ఎలా కాపాడాడు? త‌ను పోలీస్ కావాల‌నుకొన్న ల‌క్ష్యం నెర‌వేర్చుకొన్నాడా? అనేదే రామాచారి క‌థ‌.

తమిళంలో ఘ‌న విజ‌యం సాధించిన సీఐడీ మూస‌.. ఈ సినిమాకి ఆధారం. ఈ సినిమా చూసి క‌న్నడ, మల‌యాళం వాళ్లు కూడా సినిమాలు తీసుకొన్నారు. వాళ్లూ హిట్ కొట్టారు. ఓ ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్‌ టైనర్ సినిమాకి కావ‌ల్సిన అన్ని ల‌క్షణాలూ పుష్కలంగా ఉన్న చిత్రమిది. తెలుగు సినిమాకి కావ‌ల్సిన దినుసులూ గట్రా వేస్తే వ‌ర్కవుట్ అయ్యే స‌బ్జెక్టే! బ‌హుశా ఇవ‌న్నీ ఆలోచించే ఈ సినిమాని రీమేక్ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకొని ఉంటారు. అయితే ఆ ప‌ని స‌క్రమంగా చేయ‌లేక‌పోయారు. సీన్లన్నీ ట‌ప ట‌ప‌… జ‌నాల ముందుకు వ‌చ్చిపోతుంటాయి. కానీ ఒక్కటీ స‌రిగా రిజిస్టర్ కాదు. కామెడీ ఉన్నట్టే ఉంటుంది.. కానీ అందులో న‌వ్వుకోవ‌డానికి ఏమీ ఉండ‌దు. టీవీల్లో టామ్ అండ్ జ‌ర్రీ పోగ్రాంలు చూసే వారికి బొమ్మల బ‌దులు.. మ‌నుషులు కనిపిస్తారంతే! పైగా సినిమా చూస్తున్నట్టు ఉండ‌దు. వెండి తెర‌పై… డ్రామా వేసిన‌ట్టు ఉంది. ఎంత కామెడీ సినిమా అయినా.. కావ‌ల్సిన చోట సీరియ‌స్ నెస్ తీసుకురావాలి. ఆ విష‌యంలో అంద‌రూ క‌లిసిక‌ట్టుగా విఫ‌ల‌మ‌య్యాడు. సీఎం ర‌క్షణ బాద్యత‌.. అల్లాట‌ప్పాగా తీసుకోవ‌డం చూస్తే… స‌గ‌టు ప్రేక్షకుడికీ చిర్రెత్తుకొస్తుంది.

పంచ్‌ డైలాగులూ, సంభాష‌ణ ప‌ర‌మైన కామెడీ చాలా త‌క్కువ‌. స‌న్నివేశ ప‌ర‌మైన వినోదాన్నే న‌మ్ముకొన్నారు. అక్కడ‌క్కడా కొన్ని న‌వ్వులు చిందించే ప్రయ‌త్నం చేశారు. అది కూడా… సీఐడీ మూస‌లోంచి చిందేసిన‌వే! వేణు చాలాకాలం త‌ర‌వాత క‌నిపించాడు. వ‌యసు ముదురుతున్న ఛాయ‌లు స్పష్టంగా క‌నిపించాయి. తెర‌పై డ్రామా పండించ‌డంలో అత‌ను స‌క్సెస్ అయ్యాడు. న‌టుడు కంటే డ్రామా ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొన్నాడు.

ఈజ్‌, ఎన‌ర్జీ.. ఇది వ‌ర‌క‌టిలానే ఉన్నా డైలాగులు పేల‌క‌పోవ‌డంతో… మ‌నోడు కూడా గుండు లేని తుపాకీ అయిపోయాడు. ఇక క‌మ‌లినిని ఎందుకు పెట్టుకొన్నారో? ఆ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. రెండు క్లోజులు ఎక్కువ పెట్టుంటే.. ఆ క్షణమే ధియేట‌ర్ ఖాళీ అయిపోయేది.

ద‌ర్శక‌త్వ విభాగంలో మెరుపులేం లేవు. క‌థ‌ని కాపీ కొట్టడంలో స‌ఫ‌లీకృతుడ‌య్యాడు. సీన్ల ప‌రంగా కాస్త దృష్టి పెట్టి, మంచి కాస్టింగ్‌ ని ఎంచుకొంటే… ఫ‌లితం ద‌క్కేదేమో? పైగా ఈ సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. దాంతో… దానికి ఉండ‌వ‌ల‌సిన ఆక‌ర్షణ త‌గ్గింది. మ‌ణిశ‌ర్మ సంగీతం కూడా చాలా సాదాసీదాగా ఉంది. పాట‌లు లేని త‌ల‌నొప్పిని తెచ్చిపెడ‌తాయి. అలీ, చంద్రమోహ‌న్‌, ఎల్బీ శ్రీ‌రామ్‌… వీళ్లంతా అనుభ‌వ‌జ్ఞులు కాబ‌ట్టి… చ‌క‌చ‌క చేసేశారు. బ్రహ్మీ కూడా చింతామ‌ణి పాత్రలో ఓకే. ఇంత మంది హాస్య న‌టులున్నారు కాబ‌ట్టి.. ట్రీట్‌ మెంట్‌ పై శ్రద్ధ తీసుకొంటే బాగుండేది. లేదు కాబ‌ట్టే.. రామాచారి.. కేవ‌లం డ్రామాచారిగా మిలిగిపోయింది.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  2.25/5                                         – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version