రివ్యూ : స‌ర‌దాగా అమ్మాయితో

Saradaga-ammaitho-movie-review-rating (1)

తెలుగుమిర్చి రేటింగ్‌ :   2.5/5 | Click here for English Review

 స‌ర‌దా లేదూ పాడూ లేదూ…!

మన దర్శకులు మరారు. అరిగిపోయిన కథలనే మళ్లీ తిప్పి చూపించడం అసలు వదలరు. కథలనే నమ్మకపోవడం, ప్రేమ పేరుతో మసాలా జొప్పించడం, సెన్సార్ కి అందని బూతులు యదేఛ్ఛగా జొప్పించడం.. వీటి నుంచి తెలుగు సినిమా ఇంకా బయట పడలేదు. రొమాన్స్, ప్రేమ అనే పదాలకు సెక్స్ అంటూ సరి కొత్త అర్థానిచ్చేస్తున్న సినిమాల జాబితాలో చేరిపోవడానికి మరో సినిమా వచ్చింది. అదే.. ‘సరదాగా అమాయితో’. ఇది వరకు లవ్ స్టోరీ వచ్చిందంటే చూడ్డానికి ఎంతో కొంత ఉత్సాహం ఉండేది. ఇప్పుడు.. ఆ ఉత్సాహం చప్పున చల్లారిపోతోంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు.

సంతోష్ (వరుణ్ సందేశ్)కి అమ్మాయిల పిచ్చి. అది ఏ స్థాయిలో ఉంటుందంటే – ప్రపంచం అంతా అమ్మాయిలతో నిండిపోవాలి. ఆ ప్రపంచంలో నేనొక్కడినే అబ్బాయిగా ఉండాలి అనుకొనే మనస్తత్వం. ప్రతీ అమ్మాయికీ ఓ బలహీనత ఉంటుంది – దానితో ఆడుకోవడమే మగాడి నైజం అని నమ్మే అబ్బాయి. అలాగనే అందరి అమ్మాయిలనూ మాయ చేస్తాడు. మచ్చిక చేసుకొంటాడు. ఆ తరవాత తన కోరికలు తీర్చుకుంటాడు. అలా.. (నిషా అగర్వాల్) నీ ఇష్టపడతాడు. తనని ఎలాగైనా ట్రాప్ చేయాలనుకుంటాడు. కానీ తను మాత్రం తేలిగ్గా లొంగదు. సంతోష్ కి ఏ పరీక్ష పెడుతుంది. అందులో విజయం సాధిస్తేనే ప్రేమిస్తా అని షరతు విధిస్తుంది. ఇంతకీ ఆ పరీక్ష ఏమిటి? అందులో సంతోష్ గెలిచాడా? లేదా? అనేదే మిగిలిన కథ.

చాలా బలహీనమైన కథ ఇది. వెంకటేష్ సినిమా ‘ప్రేమతో..రా’ పోలికలు కనిపిస్తాయి. అదొక్కటే కాదు ఇందులో చాలా సినిమాల పోలికలున్నాయి. నాలుగైదు సినిమాల కథల్ని కలిపి వండేసి కొత్తగా వంట చేయడం – ఇప్పుడు నడుస్తున్న ట్రెండే. అయితే కనీసం ట్రీట్ మెంట్ అయినా కొత్తగా ఉండాలి కదా..? అక్కడ కూడా భాను శంకర్ శ్రద్ధ తీసుకోలేదు. ఈ సినిమాలో చాలామంది అమ్మాయిలు కనిపిస్తారు. అయితే ఎవ్వరికీ ఓ వ్యక్తిత్వం లేనట్టు. సెక్సికి పడిగాపులు కాచే రకాలన్నట్టు చూపించారు. అంతెందుకు.. ? కథానాయిక పాత్ర కూడా అంతే. సంతోష్ తిరుగుబోతు అని తెలిసి కూడా అతనికి ఓ ఛాన్స్ ఇవ్వడం ఏమిటి? సినిమాటిక్ సన్నివేశాలు ఈ సినిమాలో చాలా చాలా ఉన్నాయ్.

విశ్రాంతి తరవాత కథ మరీ నత్తనడక నడుస్తుంది. వరుణ్ సందేశ్ ని తీసుకెళ్లి ఓ అమ్మాయిల హాస్టల్ లో పడేయడం, అక్కడి అమ్మాయిలు వెర్రి చేష్టలు చూస్తే ‘ఓరి భగవంతుడా? లోకంలో అమ్మాయిలు ఇంతగా పాడైపోయారా?’ అనే అనుమానం వేస్తుంది. అమ్మాయిల తల్లిదండ్రులకైతే భయమూ కలుగుతుంది. ఇక సెన్సార్ బీప్ లు బోలెడన్ని. వాటిని దాటుకుంటూ వచ్చిన మాటలూ చాలా ఉన్నాయ్. రాత్రంతా నీధ్యాసలో మొత్తం తడిసి ముద్దయి పోయింది. – నా మనసు..’ లాంటి ఆణిముత్యాలు ఎన్నో? అమ్మాయిని చూడగానే అబ్బాయి జేబులో చేయి వేసుకొంటే మూడ్ వచ్చేసినట్టేనా? ఇదేం పాడు లాజిక్!? ఓ లేడీ డాక్టర్ అబ్బాయిని చూసి టెంఫ్ట్ అయిపోయి బాత్రూమ్ లోకి వెళ్లి చన్నీళ్ల స్నానం చేస్తుందా? వాట్ ఏ పరిశీలన?

వరుణ్ సందేశ్ ఏ మారలేదు. అదే అతి నటన. దానికి తోడు మేకప్ మరీ ఎక్కువైంది. నిషా చేసిందేం లేదు. కొన్ని చోట్ల కాజల్ లా కనిపించడం ఒక్కటే ఆమెలోని ప్లస్ పాయింట్. అలీ ఉన్నా నవ్వించలేకపోయాడు. ముమైత్ ఖాన్ ఉన్నా జనం గుర్తుపట్టలేకపోయారు. రావు రమేష్ ని పెట్టుకొన్నా ఉపయోగించుకోలేకపోయారు. సంగీతం సోసోనే. ఒక్కపాట కూడా గుర్తుండదు. ఛాయాగ్రహణం ఒక్కటే ప్లస్ మార్కులు దక్కించుకొంటుంది.

ప్రేమ గొప్పదనాన్ని చెప్పడానికి చాలా మార్గాలున్నాయి. అమ్మాయిల్ని ముందు దిగజార్చి – ఆ తరవాత వాళ్లని ఆకాశానికి ఎత్తేయడం వల్ల ప్రేమలోని మాధుర్యం, అమ్మాయిల విలువ బయటపడతాయనుకోవడం తెలివితక్కువ తనమే. బూతు మిక్స్ చేసి నీతి చెబుతానంటే, ప్రేక్షకులు చూడ్డానికి సిద్ధంగా లేరని దర్శక నిర్మాతలు గుర్తిస్తే మంచిది.

 తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.5/5 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version