రివ్యూ : స్పై | SPY Movie Review


చిత్రం : స్పై
తెలుగుమిర్చి రేటింగ్ : 2.5/5
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, రానా దగ్గుబాటి, తదితరులు
దర్శకుడు : గ్యారీ బి హెచ్
నిర్మాత: కె రాజశేఖర్ రెడ్డి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
విడుదల తేదీ : జూన్ 29, 2023

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యం ఆధారంగా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి నిఖిల్ ‘స్పై’ సినిమాతో ఆ అంచనాలు అందుకున్నాడా ? నిఖిల్ కి మరో పాన్ ఇండియా విజయం దక్కిందా ? అనేది రివ్యూలో చూద్దాం.

కథ :

జై అలియాస్ విజయ్ (నిఖిల్) ‘రా’ ఏజెంట్. అతని అన్నయ్య సుభాష్ (ఆర్యన్ రాజేష్) సైతం ‘రా’ ఏజెంటే. అయితే ఒక ఆపరేషన్ లో మిస్టీరియస్ గా ప్రాణాలు కోల్పోతాడు. తన అన్నయ్యను ఎవరు చంపారో తెలుసుకోవాలని జై ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ ఖాదిర్ ఖాన్‌(నితిన్ మెహతా) ను పట్టుకోవడానికి జై (నిఖిల్) ని నియమిస్తాడు రా ఛీఫ్ శాస్త్రీ (మకరంద్ దేశ్‌పాండే). అదే సమయంలో మన దేశానికి అత్యంత కీలకమైన ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ కు సంబంధించిన ఓ సీక్రెట్ ఫైల్‌ మిస్ అవుతుంది. ఇంతకీ ఆ ఫైల్‌లో ఏముంది ? ఆ ఫైల్ ను తిరిగి దక్కించుకున్నాడా ? సుభాష్ ఎలా చనిపోయాడు ? ఖాదిర్ ఖాన్‌ ని పట్టుకున్నాడా ? అనేదే ‘స్పై’ మూవీ స్టోరీ.

కథనం :

కథ బాగుంటే సరిపోదు.. కథనం కూడా ఆసక్తికరంగా ఉంటేనే స్పై కథలు ఆకట్టుకుంటాయి. అది నిఖిల్ స్పై సినిమాలో మిస్ అయింది. మన దేశానికి స్వాతంత్య్రం తేవడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించిన స్టోరీ అనగానే ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తి ఏర్పడింది. దాన్ని అనుకున్న విధంగా తెరకెక్కించడంలో ఈ సినిమా దర్శకుడు కమ్ ఎడిటర్ గ్యారీ తడబడ్డాడు. సుభాష్ చంద్రబోస్ గురించి ఏదన్నా చెప్తారేమో.. ఆ సీక్రెట్స్ ఏమన్నా టచ్ చేసారేమో అని ఆశిస్తే మనకు నిరాశమిగులుతుంది. కేవలం పబ్లిసిటీ కు మాత్రమే సుభాష్ చంద్రబోస్ ని వాడారని అర్దమవుతుంది. అంతేకాదు ఉత్కంటభరితమైన థ్రిల్లింగ్ అంశాలు, నిర్మాణ విలువల గురించి, కథలో లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఎడిటింగ్ & డైరెక్షన్.. రెండు విభాగాల్లోనూ గ్యారీ బీహెచ్ ప్రభావం చూపించలేదు.

పెర్ఫార్మన్స్ :

కథ, కథనాలు ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే.. జై పాత్రకు న్యాయం చేయడానికి నిఖిల్ శాయశక్తులా ప్రయత్నించారు. కొన్ని సీన్లలో ఆయన నటన బావుంది. సినిమాను భుజాల మీద మోయడానికి ట్రై చేశారు. హీరోతో పాటు సినిమా అంతా ట్రావెల్ చేసే కమల్ పాత్రలో అభినవ్ గోమఠం కనిపించారు. సన్నివేశంతో సంబంధం లేకుండా కొన్నిచోట్ల ఆయన కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. ఇటు ఐశ్వర్య మీనన్.. అటు సాన్య ఠాకూర్ ఇద్దరూ బాగానే నటించారు. మకరంద్ దేశ్ పాండే రా ఛీఫ్‌గా పర్లేదు. ఆర్యన్ రాజేష్, రవి వర్మ, సచిన్ ఖేడ్ కర్ అంతా ఓకే. రానా దగ్గుబాటి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఇకపోతే పాటలు అంతగా ఆకట్టుకోలేదు కానీ.. శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ బావుంది. విఎఫ్ ఎక్స్ ఇంకాస్త క్వాలిటీ ఉంటే బాగుండేది.

పాజిటివ్స్ :

నిఖిల్
నేతాజీ సీన్స్
బ్యాగ్రౌండ్ స్కోర్
కొన్ని యాక్షన్ సన్నివేశాలు

నెగటివ్స్ :

దర్శకత్వం
కథనం
ఉత్కంఠభరితమైన సీన్స్ లేకపోవడం

ఫైనల్ పాయింట్ : ఆకట్టుకోలేకపోయిన ‘స్పై’