రివ్యూ : సుకుమారుడు

sukumarudu-telugu-movie-review

తెలుగుమిర్చి రేటింగ్‌ : 1.5/5 | Click here for English Review

ఏమ్రాత్రం సుకుమారత్వం లేదు

ఏ వంటకానికి ఆ దినుసులే వాడాలి. దినుసులన్నీ రుచిగానే వున్నాయి కదా, అన్ని రకాలు కలిపి వాడేసే, వంటకం పాడయ్యే ప్రమాదం వుంది. సినిమాకు కామెడీ అవసరమే. కానీ అలా అని సినిమాయే కామెడీ కాకూడదే. తెరనిండా పాత్రలను నిలబెట్టేసి, ఎవరికి తోచిన వ్యవహారం వారు చేస్తుంటే, ప్రేక్షకుడు కళ్లప్పగించి చూసేస్తాడనుకుంటే పొరపాటు. కళ్ళు తిరిగి పడిపోయినా పడపోవచ్చు. రెండు హిట్ లు కొట్టిన నటుడు ఆది హ్యాట్రిక్ కోసం చేసిన ‘సుకుమారుడు’ చూస్తుంటే ఇలాంటి సూక్తిముక్తావళి లైన్లు చాలా గుర్తుకువస్తాయి. ఎటొచ్చి సినిమా మాత్రం గుర్తుండదు.

ఇటీవల వచ్చిన గ్రీకువీరుడు సినిమా లైన్, సుకుమారుడు థ్రెడ్ ఒక్కటే. అమెరికాలో బంధాలు, అనుబంధాలకు దూరంగా, ధనమే పరమావథిగా పెరిగిన కుర్రాడు, అనుకోకుండా ఆ డబ్బు కోసమే అభిమానాలు నిండిన ఇంటికి రావడం, ఎలా మారాడన్నదే విషయం. సుకుమారుడు (ఆది) అమెరికాలో పెరిగిన కుర్రాడు. తండ్రి అన్నా అభిమానం వుండదు. కానీ అనుకోకుండా వ్యాపారం పెట్టుబడి కోసం ఇండియాలోని అమ్మమ్మ వర్థనమ్మ (శారద) ఆస్తిపై కన్నేస్తాడు. పల్లెకు వచ్చి ఆ ఆస్తిని తన పేర రాయించుకుని, అమ్మేసుకు పోవాలని చూస్తాడు. కానీ మామయ్య (రావురమేష్) అడ్డుపడుతుంటాడు. వర్థనమ్మ చాదస్తాలు, పద్దతులు కూడా అడ్దుపడుతుంటాయి. మరో వారసురాలు కూడా రంగప్రవేశం చేస్తుంది. ఈ నేపథ్యంలో చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.

తనలోణి టాలెంట్ మొత్తం ఈ సినిమాలో చూపించాలని ఫిక్సయిపోయినట్లున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు, పెద్ద ఎన్టీఆర్ డైలాగులు, పౌరాణిక సన్నివేశాలు, అన్నీ.. వేసేశాడు… చూపించేసాడు.. వినిపించేశాడు. ఇక తెరపై అప్పుడు కనిపిస్తుంది హీరోయిన్ (నిషా అగర్వాల్) చాన్నాళ్ల తరవాత నటించిన శారద బాగానే చేసింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ తళుక్కున మెరిశాడు. కృష్ణ ఇలాంటి తండ్రి పాత్రలు అప్పుడప్పుడయినా వేయెచ్చు కదా అనిపించేలా చేశాడు. ఇక మిగిలిన నటీనటులు తెరపట్టనంత మంది ఉన్నారు. సీనియర్ కమెడియన్ శ్రీలక్ష్మీ దగ్గర నుంచి ధనరాజ్ వరకు.

సాంకేతికంగా సినిమా రిచ్ గానే వుంది. ఫొటో గ్రఫీ (సాయి శ్రీరామ్) బాగానే వుంది. అనూప్ రూబెన్స్ రెండు మూడు పాటలు బాగా చేశాడు. నేపథ్యసంగీతం గోలగా వుంది. వేమారెడ్డితో కలిసి దర్శకుడు రాసుకున్న డైలాగులు బాగానే వున్నా, గోలలో కలసిపోయాయి.

ఇప్పుడు సినిమా ఎలా వుందో చూద్దాం. దర్శకుడు సినిమాను కామెడీ ఎంటర్ టైనర్ గా తీయాలనుకోవడం వరకు బాగానే వుంది. కానీ లెక్కకు మిక్కిలిగా పాత్రలను సృష్టించినపుడు, స్ర్కిప్ట్ గందరగోళం కాకుండా చూసుకోవాలి. ఒక పక్క సినిమా వెళ్లాల్సిన దారిలో వెళ్తుండగానే, ఈ పాత్రలన్నీ రావాలి. అవి కథలో కలవాలి. ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకూడదు. కానీ ఈ సినిమాలో పాత్రలన్నీ వస్తుంటాయి. అవి వాటికి తోచిన కామెడీ అవి చేస్తుంటాయి. మరో వేదిక, వేరే పాత్రలు, వేరే కామెడీ. ఆ కామెడీ కూడా ఒక తరహాగా నడవదు. పల్లె పట్టులు, టీవీ సెటైర్లు, నాటకాలు, జానపదాలు ఇలా ఒకటేమిటి అన్నీ చూపించేస్తుంది. ప్రారంభంలో హీరో, అతగాడి స్వభావం, స్టయిల్ వేరు. రాను రాను ప్రతి చోట హీరో కనపడాలన్నట్లు, ఈ కామెడీ మూకల నడుమ అతగాడూ వుంటుంటాడు. అసలు ఒకదశలో హీరో విలన్ గా కూడా మారిపోతాడు. ఇవన్నీ చాలదన్నట్లు తమిళ ముతక కామెడీ కొంత. ఇలా తీస్తే, జనం చూస్తారని దర్శకుడు అనుకున్నాడంటే, తెలుగు ప్రేక్షకుల పట్ల అతగాడికి చాలా చిన్న చూపువున్నట్లు అనిపిస్తుంది. మొత్తం మీద ఓ విఫల ప్రయత్నం సుకుమారుడు.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  1.5/5                                         – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version

 

Click here for Thadaka Review