రివ్యూ : త‌డాఖా

tadakha-telugu-movie-review-rating

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3/5 | Click here for English Review

 

 సగం తనఖా… మిగతా సగం తడాఖా…!

రీమేక్ సినిమాల్లో ఒకటి కాదు… చాలా సౌలభ్యాలున్నాయి. కథలోని ప్లస్సులూ, మైనస్సులూ ముందే తెలిసిపోతాయి. కాస్త తెలివిగా మసులుకొంటే – తప్పుల్ని సరిదిద్దుకొంటూ ప్లస్సులను పెంచుకోవచ్చు. ఇది వరకే హిట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి టేకింగ్ విషయంలోనూ పెద్దగా ఆలోచించుకోవలసిన అవసరం లేదు. మరీ సీడీ ముందరపెట్టుకొని సీన్లు తీసేస్తే – మక్కీకి మక్కీ దించేశారు అనుకొనే ప్రమాదం ఉంది. కాబట్టి దర్శకుడు తనవంటూ కొన్ని సొంత తెలివితేటలు జోడించి తన ముద్ర కనబడేలా చేసుకోవచ్చు. దర్శకుడు కిశోర్ కి ఆ అవకాశం దక్కింది. ‘వెట్టై’ ఒక చోట నిరూపించుకొన్న కథ. దాన్నిప్పుడు ‘తడాఖా’ గా తీసుకొచ్చాడు. ఇద్దరు ఫ్లాప్ హీరోలు, తనకంటూ సొంత ఇమేజ్ లేని దర్శకుడు – కానీ ఓ హిట్టు కథ. ఈ ప్రయాణం ఎలా సాగింది? సునీల్, నాగచైతన్య కెరియర్ లో ‘తడాఖా’ కి ఉన్న స్థానమేమిటి? ‘వెట్టై’ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ఎలా వండారు? తెలుసుకొందాం పదండి.

శివ (సునీల్), కార్తీక్ (నాగచైతన్య) ఇద్దరూ అన్నదమ్ములు. శివ కాస్త పిరికివాడు. దేనికీ ధైర్ఘ్యం చేయడు. కానీ కార్తిక్ అలా కాదు. దెబ్బతినడానికైనా, దెబ్బ కొట్టడానికైనా తెగింపు కావాలి… అంటాడు. ఇద్దరూ పెద్దవాళ్లవుతారు. తండ్రి (నాగబాబు) మరణానంతరం అతను చేస్తున్న పోలీస్ ఉద్యోగం శివకు వస్తుంది. భయపడుతూనే ఖాకీ డ్రెస్సు వేసుకొంటాడు శివ. తమ్ముడు అండగా ఉంటానని నమ్మి.. ఇష్టం లేకపోయినా పోలీస్ అవుతాడు. బుగ్గా (అశితోష్ రాణా) అంటే అందరికీ హడల్. సముద్రాన్ని అడ్డాగా చేసుకొని స్మగ్లింగ్ చేస్తుంటాడు. అతనికి కాశీతో పోటీ. ఆ ఊరిలోనే శివకు పోస్టింగ్. శివలోని పిరికితనం పోగొట్టి ధైర్ఘ్యం నూరిపోస్తుంటాడు కార్తిక్. అన్న స్థానంలో తాను వెళ్లి.. రౌడీ మూకల ఆట కట్టిస్తుంటాడు. క్రెడిట్ మాత్రం.. శివ ఖాతాలోకి వెళ్లేలా జాగ్రత్త పడతాడు. దాంతో శివ ఆ ఊరిలో హీరో అయిపోతాడు. శివకి నందిని (ఆండ్రియా)తో పెళ్లవుతుంది. నందిని చెల్లెలు పల్లవి (తమన్నా), కార్తిక్ ప్రేమించుకుంటారు. అయితే నందిని మాత్రం తన చెల్లాయికి అమెరికా సంబంధం చూస్తుంది. మరోవైపు బుగ్గా, కాశీలకు.. శివ ఓ డమ్మీ అనీ, ఆ ముసుగులో తమ ఆటకట్టిస్తోంది కార్తిక్ అని తెలిసిపోతుంది. మరి ఆ తరవాత ఏం జరిగింది? బుగ్గా, కాశీల నుంచి తన అన్నయ్యను ఎలా కాపాడుకొన్నాడు? పల్లవిని పెళ్లిచేస్తుకొన్నాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ.

అన్నదమ్ముల కథొకటి సినిమాగా వచ్చి చాలా కాలం అయ్యింది. ఈ మధ్య ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అన్నదమ్ముల అనుబంధం చూపించింది. అయితే అది పూర్తిగా కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే చిత్రం పంతాలు, ఫైటింగులూ ఉండవు. అవి కూడా కావాలంటే ఈ సినిమా చూడాలి. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో తమ్ముడికి కాపాడుకొంటుంటాడు అన్నయ్య. కానీ ఈ లైన్.. ‘తడాఖా’లో రివర్స్ అయ్యింది. అన్నయ్యలో ధైర్ఘ్యం నూరిపోసే ఓ తమ్ముడి కథ ఇది. అందుకే.. కొత్తగా సన్నివేశాలు రాసుకోవడానికి వీలు దక్కింది. ఈ క్రిడిట్ అంతా తమిళ దర్శకులకూ, రచయితలకూ ఇవ్వాలి. దాన్ని తెలుగులో కాస్త తెలివిగానే తర్జుమా చేశాడు డాలీ. సినిమా టేకాఫ్ చాలా ఆసక్తికరంగా ఉంది. సునీల్ ని పోలీస్ గా చూపించడం. అతని స్థానంలో తమ్ముడు వెళ్లి సమస్యలను ఛేదించడం ఇవన్నీ కొత్తగా కనిపిస్తాయి. వినోదం ఎక్కడా మిస్ కాకుండా సన్నివేశాలు రాసుకోగలిగాడు. సునీల్ ని హీరోగా పొగిడేస్తూ పోలీస్ స్టేషన్ లో చూపించిన దృశ్యాలు, జేపీ కౌగిలింతలూ, డప్పుకి దరువేయడాలూ ఫన్నీగా అనిపిస్తాయి. నాగ చైతన్య, తమన్నాల మధ్య కెమిస్ట్రీ మళ్లీ కుదిరింది. పాటలూ కాస్త జోష్ ని ఇచ్చాయి. దాంతో తొలి సగం.. హాయిగా సాగిపోయింది.

చిక్కంతా సెకండాఫ్ లోనే. ప్రతి నాయకులకు ఈ డమ్మీ నాటకం తెలిసిపోవడంతో – ఆ తరవాత కథలో వచ్చే కొత్త మలుపు ఏం లేకపోవడంటో బంగారం ధర పడిపోయినట్లు సినిమా గ్రాఫ్ చకచక పడిపోయింది. సెకండాఫ్ లో కన్వినెన్స్ గా చెప్పిన సన్నివేశం ఒక్కటుంటే ఒక్కటీ లేదు. తొలి భాగం ఈ సినిమాకి ఏవైతే ప్లస్సులుగా కనిపించాయో. అవన్నీ విశ్రాంతి తరవాత మైనస్ లు అయిపోయాయి. రొటీన్ సన్నివేశాలు, అంతే రొటీన్ గా సాగిన క్లైమాక్స్ తో ఈ సినిమాకి శుభం కార్డు వేసేశారు. ‘విశ్రాంతి’ తరవాత కూడా ఏదో మ్యాజిక్ ఆశించిన ప్రేక్షకుడికి సగం భోజనమే పెట్టి పంపించేశారు. చైతూని మాస్ హీరోగా నిలబెట్టే ప్రయత్నం ఈ సినిమా. సునిల్ పాత్రని నిజంగానే డమ్మీని చేసేశారు. సోలో పాట వస్తే – డాన్సుల్లో ఎక్కడ రెచ్చిపోయి చైతూని మర్చిపోయేలా చేస్తారేమోనని ఆ సాహసం చేయలేదు. నిజానికి సునీల్ ని కూడా సమర్థవంతంగా వాడుకొంటే – ఆ ఫలితం బీసీ సెంటర్లలో బాగా కనిపించేది. ఎంతసేపూ చైతూని ఎలివేట్ చేయాలని చూశారు తప్ప- అందులో కొంతభాగం సునీల్ కీ ఇచ్చుంటే ఈ సినిమా వేరేలా ఉండేది. క్లైమాక్స్ లో కూడా అంతే. సిక్స్ ప్యాక్ కండలతో సిద్ధమైన సునీల్ ని ఓ పక్కన పడుకోబెట్టి… ఫైటింగ్ చేసేశాడు చైతూ.

చైతన్య చాలా సినిమాల తరవాత కాస్త పరిణితితో నటించాడేమో అనిపిస్తుంది. అతని డిక్షన్ మరి కాస్త సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. ఆశితోష్ రాణా దగ్గర పవర్ పుల్ డైలాగులు చెప్పేటప్పుడు.. ఏనుగు ముందు నిలబడి.. ఎలుక ఛాలెంజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయినా సరే – ఇదివరకటి సినిమాల కంటే ‘తడాఖా’లో బెటర్ నాగచైతన్య కనిపిస్తాడు. సునీల్ కి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి.. చూపించుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ అండర్ ప్లే మాత్రం చాలా సమర్థంగా చేశాడు. తమన్నా.. పాటలకు ముందొచ్చేది. అది అయిపోగానే వెళ్లిపోయేది. ఉన్నది కాసేపైనా నడుమొంపులు మాత్రం బాగా చూపించింది. బ్రహ్మానందం, రమాప్రభ, వెన్నెల కిషోర్.. వీళ్ల ప్రసహనం మరో వైపు. నేను కూడా ఉన్నానోచ్ అని చెప్పుకోవడానికి తప్ప.. ఆండ్రియా చేసిందేమీ లేదు.

తమన్ సంగీతం మన మెదడుకు పని కల్పిస్తుంది. ఈ పాటెక్కడో విన్నట్టుందే. అనే సందేహాలు రెకెత్తిస్తుంది. గుర్తొస్తే – మీ మెదడు చురుగ్గా పనిచేస్తున్నట్టే. ఆర్.ఆర్ మాత్రం బాగా చేశాడు. కెమెరాపనితనం బాగుంది. ప్రతి సీన్ రిచ్ గా చూపించాలనే తపన కనిపించింది. సాంకేతికంగా ఈ సినిమా భారీగా తీర్చిదిద్దారు. కిషోర్ కి ఈ సారి దర్శకుడిగా పాస్ మార్కులు దక్కుతాయి. ఓ హిట్ కథని.. యావరేజ్ గా చూపించడంలో మాత్రం సఫలీకృతడయ్యాడు. మొత్తమ్మీద చెప్పాలంటే ‘తడాఖా’.. కాలక్షేపానికి సరిపడే సినిమా. ఇద్దరు హీరోలు ఉన్నారు కదా.. అని ఎక్కువ ఆశించి వెళ్లకండి. భంగపడతారు.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  3/5                                         – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version

 

Click here for Sukumarudu Review