త్రివిక్రమ్.. ఎందుకింత ధీమా ?

త్రివిక్రమ్ మంచి మాటల రచయిత. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు. పవన్ కళ్యాణ్ స్నేహితుడు. స్టేజ్ ఎక్కితే సినిమా డైలాగులకి మించి ప్రాసలు మాట్లాడతారు. తన వాక్చాతుర్యం, విషయ పరిజ్ఞానంతో అందరి చేత గురూజీ అనిపించుకుంటారు. అంతా బాగానే వుంది.. కానీ త్రివిక్రమ్ వర్క్ ని అభిమానించే వాళ్ళకి మాత్రం ఆయన ధీమా చూస్తుంటే.. కాస్త చిరాకు ఇంకాస్త అసహనంగా వుంది.

ఒక దర్శకుడికి కొలమానం.. అతను పెద్ద హీరోకి స్నేహితుడనో, స్టేజ్ కి ఎక్కితే బాగా మాట్లడతాడనో, పురాణాలు తెలిసినవాడనో కాదు. ఒక దర్శకుడికి నిజమైన కొలమానం అతని పని, అతను తీసిన సినిమా.

త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి మూడేళ్ళు గడిచిపోయింది. కరోనా లాక్ డౌన్ అనుకున్నా.. తర్వాత దర్శకులు హీరోలు తమ కొత్త సినిమాలతో పలకరించేశారు. కానీ తివిక్రమ్ నుంచి మాత్రం సినిమా రాలేదు. ఇది ఆయన్ని ఎంతగానో అభిమానించే వారికి నిరుత్సాపరుస్తోంది.

సినిమా తీయడానికి నిర్మాత లేరా అంటే.. హారిక హాసిని ఆయన హోం బ్యానర్. హాలీవుడ్ కి వెళ్లి సినిమా తీస్తానని చెప్పినా బడ్జెట్ సర్దుతారు. ఇక్కడ నిర్మాత సమస్య లేదు. ఇక సినిమాకి కావాల్సిన ప్రధాన ఇంధనం.. కథ. త్రివిక్రమ్ స్వయంగా కథకుడు. ఆయనకు కథల లోటు లేదు.

మరి ఏమిటి సమస్య… చెప్పాలంటే ఆయనే సమస్య. మొహమాటమో లేదా మరేమిటో తెలీదు కానీ హారిక హాసిని, సితార సంస్థలలో ఆయన సిఈవో లాంటి పొజిషన్ తీసుకున్నారు. అక్కడ నిర్మిస్తున్న సినిమాలన్నిటిపై సూపర్ విజన్ చేస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్. మరోపక్క పవన్ కళ్యాణ్ సినిమాల భాద్యత కూడా ఆయనే తీసుకున్నారు. వారి మధ్య మంచి స్నేహం వుంది. ఆయన సినిమా వ్యవహారాలు త్రివిక్రమ్ అద్వర్యంలోనే జరుగుతాయనేది కూడా ఓపెన్ సీక్రెట్.

పవన్ భీమ్లా నాయక్ మాటలు రాశారు త్రివిక్రమ్. ఆ రీమేక్ సినిమాకి త్రివిక్రమే రాయాల్సిన అవసరం లేదు. భాషని తర్జుమా చేయడానికి త్రివిక్రమే కావాలా ? కానీ చేశారు. ఇప్పుడు చేస్తున్నమరో రీమేక్ కూడా త్రివిక్రమ్ సారధ్యంలోనే జరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు.

ఇక్కడే మహేష్ బాబు అభిమానులకు కాలుతోంది. మహేష్ బాబు తో త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాని ఆగస్ట్ 11 న విడుదల అని చెప్పారు గతంలో. కానీ ఆ డేట్ కి చిరంజీవి భోళా శంకర్ వస్తోంది. ఈ ఏడాది చిరంజీవి నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. బావుంది. కానీ త్రివిక్రమ్ పరిస్థితి ఏమిటి ? మహేష్ బాబు సినిమాని ఎప్పుడు తెస్తారు. జులై 28న పవన్ కళ్యాణ్ సినిమా డేట్ ఇచ్చేశారు. అంటే ఈ డేట్ కి కూడా మహేష్ సినిమా రాదని తేలిపోయింది. అంటే.. మళ్ళీ జనవరికి వెళ్లిపోవాలి. ఆ లెక్కన త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి నాలుగేళ్ళు ధాటిపోతుంది.

త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ ఒక సినిమాకి నాలుగేళ్ళు విరామం అంటే మామూలు ధీమా కాదిది. త్రివిక్రమ్ ఏదేమైనా క్రియేట్ చేస్తే చూడాలని ఆయన వర్క్ ని అభిమానించే వారు ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మాత్రం రీమేక్ సినిమాలకి, సితార సినిమాల పర్యవేక్షకుడిలా కాలం సాగదీయడం ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదు.