రామనవమి ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి?

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్రనామం తత్ తుల్యం రామనామం వరాననే ॥

ద‌శావ‌తారల్లో రామావతరం ఏడవది. రాముడు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగోపాదం లో క‌ర్ఖాట‌క‌ లగ్నం లో పుట్టాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి శ్రీరామ జయంతి.వసంత నవరాత్రుల‌లో ఆఖరి రోజు నవమి.

విష్ణు మూర్తి దశవాతరాల కు జయంతి తిధులు పంచాంగ కర్తలు నిర్ణయించారు.

1. మత్స్య…… చైత్ర బహుళ పంచమి.
2. కూర్మ……..వైశాఖ పూర్ణిమ.
3. వరాహ…… చైత్ర బహుళ త్రయోదశి.
4. నారసింహ…వైశాఖ శుద్ధ ద్వాదశి.
5. వామన…బాద్రపద శుద్ధ చతుర్ధశి.
6. పరశురామ… వైశాఖ శుద్ధ ద్వాదశి.
7. శ్రీరామ… చైత్ర శుద్ధ నవమి.
8. కృష్ణ……శ్రావణ బహుళ అష్టమి.
9. బుద్ధ….వైశాఖ శుద్ధ పౌర్ణమి.
10. కల్కి….బాద్రపద శుద్ధ విధియ.

ఇందులో కేవలం చైత్ర మాసంలోనే మూడు తిధులు వ‌స్తున్నాయి. అందులో నవమి తిథి మొదట వస్తుంది. నవమి వేడుకలు తొమ్మిది రోజులు చేస్తారు. పాడ్యమి మొదలుకుని నవమి వరకు వీటిని గర్భ నవరాత్రులు అంటారు. (ఇదే స‌మ‌యంలో అంటే పాడ్యమి నుండి నవమి వరకు వసంత నవరాత్రులు చేసే వాళ్ళు ఉంటారు). శ్రీ రాముడు పుట్టిన నవమి ముందు రాముడు కడుపులో ఉన్న చివరి తొమ్మిది రోజులు రామాయణ పారాయణం చేస్తారు. పూజలు చేస్తారు వీటినే గర్భ నవరాత్రులు అంటారు. పాడ్యమి నుంచి నవమి వరకు రాముని గుడిలో రామాయణం పారాయణం చేస్తారు. నవమి ఎప్పుడు అష్టమితో ఉన్న నవమి పనికిరాదు మిగులు నవమి చేసుకోవాలి. అన్ని పూజలూ ఉదయాన్నే చేసుకుంటాం. కానీ నవమి పూజ మధ్యాన్నం 12 గంటలకి చేస్తారు. కారణం రాముడు మధ్యాహ్నం పుట్టడం వల్ల. నార్త్ లో రామాలయాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాముని పుట్టుక నుంచి పట్టాభిషేకం వరకు ఉన్న వివిధ కీర్తనలు పాడుతారు. సరిగ్గా పన్నెండు కీ బుక్కా పొడి ( గులాల్ పౌడర్ ) చల్లుతారు. ( ఇది మన ప్రాంతాల్లో కొన్ని చోట్ల పెళ్లిళ్లకు శుభ సూచిక‌గా వాడుతారు). తర్వాత ఉయ్యాలలో రాముడ్ని వేసి జోల పాటలు పాడుతారు. పంచదార శొంఠి పొడి కలిపి ప్రసాదం గా పంచుతారు.

సౌత్ లో షోడసోపచార పూజలు చేస్తారు. సీత రామ కళ్యాణం జరిపిస్తారు. దశరద, కౌసల్య, లక్ష్మనుడు, రామ భక్తుడైన హనుమకి కూడా పూజా చేస్తారు. రాముని జన్మ దినం కంటే గొప్ప రోజు ఇంకొకటి లేదు కనుకే అదే రోజు కళ్యాణం జరిపిస్తారు. (అసలు రాముని కళ్యాణం ఫాల్గుణ పూర్ణిమ ఉత్తర నక్షత్రాన జరిగింది.) ఈ ఆచారం కేవలం తెలుగు రాష్ట్రాల‌లోనే ఉంది.

రాముడు అందరికీ ఆదర్శం. చరిత్రలో నిలిచే రాజు, ఏక పత్ని వ్రతుడు, ఆదర్శ వంతమైన కొడుకు, మాటతప్పని వ్యక్తిత్వం, ఇలా ఒకటి కాదు… సకల గుణ సంపన్నుడు. అప్పటికి ఇప్పటికి, ఎప్పటికి అతనే మనకి ఆదర్శవంతుడు. ఎన్ని తరాలయినా అతనే మార్గ దర్శి మంచి నడవడికకి, నీతి నిజాయితీకి. రాబోయే తరాలకి మనం అందించే గొప్ప సంప్రదాయం ఇది.