చెపాక్ లో చితక్కొట్టిన సీఎస్‌కే.. లక్నో ముందు భారీ లక్ష్యం


ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. దాంతో సీఎస్కే భారీ స్కోరును అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (31 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి అర్ధ సెంచరీతో చెలరేగాడు. డెవోన్ కాన్వే (29 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. శివమ్ దూబే (27) వేగంగా ఆడి అవుటయ్యాడు. మొయిన్ అలీ (19), బెన్ స్టోక్స్ (8), జడేజా (3) విఫలం అయ్యారు. అంబటి రాయడు (14 బంతుల్లో 27 నాటౌట్ ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో అలరించాడు. చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోని వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. దాంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఇక లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, మార్క్ వుడ్ 4 ఓవర్లలో 49 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.