కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్లు..


కోకాపేటలో ఎకరం భూమి ధర 100 కోట్లు. ఏంటి షాక్ అయ్యారా ? అవునండి నిజమే. నిధుల సమీకరణలో భాగంగా తెలంగాణ సర్కారు భూముల అమ్మక ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఫేజ్ 2లో భాగంగా కోకాపేట్‌లోని నియో పోలీస్‌ లే అవుట్‌లో మొత్తం 45.33 ఎకరాలను అమ్మకానికి పెట్టింది హెచ్ఎండీఏ. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలగా ఉంది. ఈ లెక్కన ఎకరానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరనే రూ. 35 కోట్లుగా ఉంది. అయితే ఈరోజు ఉదయం 6,7,8,9 ప్లాట్లలోని 26.86 ఎకరాలకు వేలం ముగిసింది.

ఇక సాయంత్రం 10,11,14 ప్లాట్లకు సంబంధించిన 18.47 ఎకరాలకు వేలం నిర్వహించింది హెచ్ఎండీఏ. ఈవేలంలో ప్లాట్‌ నెంబర్‌ 10లో ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. దీంతో ఇప్పుడు ఈ భూమి రియల్ ఎస్టేట్ రంగంలోనే అత్యధిక ధర పలికిన భూమిగా చరిత్ర సృష్టించింది. ప్లాట్ నెంబర్ 10 ప్రైమ్ లొకేషన్ లో ఉండడంతో దీనికోసం ప్రముఖ రియాల్టీ సంస్థలు తీవ్రస్థాయిలో పోటీపడ్డాయి. ఇక ఈవేలం ద్వారా మొత్తం 45.33 ఎకరాలకు గాను ప్రభుత్వానికి రూ. 3319.60 కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూరింది.

ఇదిలా ఉంటే గతంలో కోకాపేటలో ఫేజ్‌ 1లో భాగంగా దాదాపు 49 ఎకరాలు విక్రయించగా.. ప్రభుత్వానికి రెండువేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అప్పుడు కనిష్టంగా ఎకరా రూ.31 కోట్ల నుంచి అత్యధికంగా రూ.60 కోట్ల రూపాయల ధర పలికింది. ఇప్పుడు ఎకరం భూమి ధర కనిష్టంగా రూ.67.25 కోట్ల నుంచి అత్యధికంగా రూ.100.75కోట్లు పలికింది.