అమర్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం


హిందువులకు అతిపవిత్రమైన అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు ఆన్ లైన్లో లేదా ఆఫ్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక జూలై 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. జమ్ముకశ్మీర్​లో 62రోజుల పాటు సాగే అమర్​నాథ్​ యాత్ర 2023 జులై 1న మొదలవుతుంది. ఆగస్టు 31తో ముగుస్తుంది. ఈ యాత్ర అనంత్ నాగ్ జిల్లాలోని పహల్ గావ్ మార్గం, అలాగే గండేర్ బల్ జిల్లాలోని బల్తాల్ మీదుగా రెండు మార్గాల్లోనూ కొనసాగుతుంది. అంతేకాదు అమర్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్ లో శ్రీ అమర్ నాథ్ జీ యాత్ర యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా యాప్ ద్వారా స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా తెలుసుకోవచ్చు.

ఇకపోతే 13 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. గర్భీణులు, బాలింతలను యాత్రకు అనుమతించారు. కాగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు వ్యక్తిగతంగా 220 రూపాయలుగా నిర్ణయించారు. విదేశీ యాత్రీకులకు మాత్రం రిజిస్ట్రేషన్ ఫీజును 1520 రూపాయలుగా నిర్ణయించారు. ఇక శ్రీ అమర్ నాథ్ ఆలయ బోర్డ్ కూడా ఈ సంవత్సరం ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం నిర్వహించే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్ర విజయవంతంగా పూర్తి కావడం కోసం సంబంధిత వర్గాలన్నింటినీ సమన్వయం చేస్తామన్నారు. పోలీస్, విద్యుత్, వసతి, తాగు నీరు, పారిశుద్ధ్యం, భద్రత.. తదితర సేవలను భక్తులు నిరంతరాయంగా పొందేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఇక పూర్తి వివరాలు https://jksasb.nic.in/ లో చూడవచ్చు.