ఏపీ మొదటి..చివరి ఫలితాలు ఇవే ..

సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి ఫలితం వచ్చేది నరసాపురం, మదన పల్లి నే అని తెలుస్తుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు ఉన్నందువల్ల ఫలితం మిగతా వాటికంటే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రౌండ్లకుపైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

సాధారణంగా కౌంటింగ్‌ హాళ్లలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈసారి ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి చేసేందుకు కౌంటింగ్‌ హాళ్లను బట్టీ టేబుళ్ల సంఖ్యను పెంచుకోవచ్చని ఈసీ తెలిపింది. చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల 16 నుంచి 20 వరకు టేబుళ్లున్నాయి. అందువల్ల ముందుగా చిత్తూరు జిల్లా ఫలితాలు వస్తాయి. మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 టేబుళ్లున్నాయి. అక్కడ కూడా ఫలితాలు వేగంగా వస్తాయి.

ఎన్నికల సరళి, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక రౌండు లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను కౌంటింగ్‌ కేంద్రం వద్ద మైక్‌లో వెల్లడించడంతోపాటు మీడియా ప్రతినిధులకు కనిపించేలా డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు.