గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ పథకాల సమాచారం

Chandrababu-master-planప్రభుత్వ కార్యక్రమాలలో రోజురోజుకు ప్రజల భాగస్వామ్యం పెరగడం హర్షణీయమని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల పూర్తి సమాచారాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలలో ప్రభుత్వ కార్యక్రమాల పట్ల మరింత అవగాహన పెంచాలని సోమవారం ఉదయం తన నివాసం నుంచి నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ యంత్రాంగానికి నిర్ధేశించారు.

ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా త్వరలో అందరికీ ఇంటర్‌నెట్, కేబుల్, ఫోన్ సౌకర్యం అందుబాటులోకి వస్తోందని, ఇది రాష్ట్రంలో ఒక అభివృద్ధి విప్లవమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి మహిళా ఇ-లిటరేట్ కావాలన్నదే లక్ష్యమని, ఇ-లిటరసీ గరిష్ఠ స్థాయికి చేరుకునేలా అధికార యంత్రాంగం కృషి జరపాలని చెప్పారు.
విద్యా, ఆరోగ్యరంగాలలో నిర్ధిష్ట ప్రమాణాలతో నిర్ధేశిత సూచికలను అందుకోవాలని, అలా జరగాలంటే ముందు నాలెడ్జ్ అప్‌గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 15% రాష్ట్ర వృద్ధిరేటు లక్ష్యంగా ప్రతి శాఖలో ప్రగతి సాధించాల్సి వున్నదని చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులలో ఇప్పటి వరకూ రూ.1400 కోట్లు ఖర్చు అయ్యాయని, పెండింగ్ నిధులు రూ.1200 కోట్లు వ్యయం చేశామని చెప్పారు. మొత్తం రూ.2600 కోట్లు ఉపాధి హామీ కింద ఖర్చు చేశామని, ఇంకా మిగిలిన రూ.800 కోట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రతి జిల్లాలో రూ.10 కోట్లు నిధులు కలెక్టర్ దగ్గర వున్నాయని, వాటిని పంటకుంటల తవ్వకం, సిమెంటు రోడ్ల నిర్మాణం తదితర పనులకు వినియోగించాలని సీయం నిర్ధేశించారు. ఎటువంటి అవినీతికి అవకాశం లేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రతి విద్యార్థి సమాజ ప్రగతిలో తానెక్కడ? తన కర్తవ్యం ఏమిటి? అనే స్ఫూర్తిదాయక ఆలోచనలు సాగించాలన్నారు. విభజన నాడు ఎలా ఉన్నాం? రెండేళ్ళలో ఏం సాధించాం? అనే అంశాలపై రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక విధాన పత్రం రూపొందించి దానిపై పాఠశాలలు, కళాశాలల ప్రారంభం రోజున విద్యార్థులందరూ చర్చించాలని మార్గదర్శనం చేశారు. విద్యార్ధి దశలోనే రాష్ట్రాభివృద్ధికి వినూత్న ఆలోచనలను పెంపొందించుకుని, కార్య ప్రణాళిక తయారుచేసి అమలు చేయాలన్నదే తన అభిమతమని చెప్పారు.

జూన్ 8న రాష్ట్రవ్యాప్తంగా జరిగే మహాసంకల్పం కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని స్పూర్తిదాయకంగా నిలవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తిచేశారు.