AP : వైరల్ ఫీవర్స్, వడదెబ్బలపై అప్రమత్తమైన ఆరోగ్య శాఖ


APలో వైరల్ ఫీవర్స్, వడదెబ్బలపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ఈ అంశాలపై జూమ్ ద్వారా మంత్రి విడదల రజిని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య ఆంధ్ర ముఖ్య కార్యదర్శి MT కృష్ణబాబు, ఉన్నతాధికారులు, 26 జిల్లాల DM&HOలు, 16 GGHల సూపరింటెండెంట్‌లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా.. ఇన్ఫ్లుయంజా వైరస్, వడదెబ్బపై కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలో అప్రమత్తంగా ఉన్నామని కృష్ణబాబు స్పష్టం చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్న ఆయన.. ఏర్పాట్లపై డిఎంహెచ్ఓలకు పలు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు తక్షణమే వారం రోజులపాటు ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. వడదెబ్బకు గురికాకుండా ప్రజల్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వీలైతే స్వచ్ఛంద సేవా సంస్థల్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇక ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు బయట తిరగకుండా ఉండేలా అలర్ట్ చేయాలని కృష్ణబాబు తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, జన సమ్మర్ధ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.