రాజస్థాన్ మంత్రిపై వేటు..


రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గుహా సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పించడంలో మనం విఫలమైన విషయాన్ని ఒప్పుకోవాలని రాజేంద్ర సింగ్ గుహా అన్నారు. మణిపుర్ మహిళల గురించి మాట్లాడే ముందు మన రాష్ట్రంలో మహిళా భద్రత విషయంలో ఫోకస్ చేయాలని మంత్రి సూచించారు. గత కొంత కాలంలో రాజస్థాన్ రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఎందుకు పెరుగుతున్నాయో ప్రభుత్వం గుర్తించాలని మంత్రి రాజేంద్ర సింగ్ గుహా సూచించారు.

అశోక్ గెహ్లాట్ తన వద్ద ఉన్న హోంశాఖను సమర్ధులైన వేరేవారికి అప్పగించాలని రాజేంద్ర సింగ్ గుహా సూచించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైన ప్రస్తుతం తరుణంలో పోలీసులు డబ్బులు వసూలు చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారని రాజేంద్ర సింగ్ ఆరోపించారు.

ప్రస్తుతం మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వెంటనే స్పందించిన సీఎం అశోక్ గెహ్లాట్ మంత్రిపై వేటు వేశారు. రాజేంద్ర సింగ్ గుహాను క్యాబినెట్ నుండి తొలగించాలని నిర్ణయించుకుని తన నిర్ణయాన్ని గవర్నర్ కల్ రాజ్ మిశ్రాకు తెలియజేశారు.

2020లో సచిన్ పైలట్ గెహ్లాట్ పై తిరుగుబాటు చేసిన సమయంలో రాజేంద్ర సింగ్ గుహా అశోక్ గెహ్లాట్ కు అండగా నిలిచారు. గత ఏడాది మనసు మార్చుకున్నారు. గెహ్లాట్ చేస్తున్న పనులను విమర్శించడం మొదలు పెట్టారు. కొంత కాలంగా సహిస్తూ వచ్చిన గెహ్లాట్ తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలతో వేటు వేశారు.