మోడీ సభకు రాష్ట్ర అధ్యక్షుడిగా వస్తానో..లేదో : బండి సంజయ్


తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 8న హనుమకొండలో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలసిందే. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రదాని నరేంద్ర మోదీ రానున్నారు. దీనికోసం జనాన్ని సమీకరించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా.. బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ కుమార్‌ ను మార్చుతారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు.. రాష్ట్ర అధ్యక్షుడ్ని మారుస్తారనే ప్రచారం నడుస్తోంది.. ఇది నిజమేనా అని బండి సంజయ్‌ను అడిగారు.

ఈ విషయంపై స్పందించిన బండి సంజయ్, ప్రధాని మోదీ సభకు తాను అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో భావోద్వేగానికి గురయిన కార్యకర్తలు, ఇప్పుడు మీవల్లే తెలంగాణలో బీజేపీ గ్రామీణ స్థాయి వరకు విస్తరించిందని.. మీ పోరాటం వల్లే గ్రామాల్లో అధికార పక్ష నేతల అరాచకాలను ఎదుర్కొన్నామని.. అధ్యక్షుడిగా మీరే కొనసాగాలి అన్నారు. ఇకపోతే హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని, ప్రధాని టూర్ ను విజయవంతం చేయాలని బండి సంజయ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.