వార్షిక ప్రణాళిక రూ 1,65,538 కోట్లు: విడుదల చేసిన సీఎం

Babu-Br బ్యాంకర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్.ఎల్.బి.సి) లో పాల్గొని రూ. 1,65,538 కోట్ల అంచనాతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రణాళికకు ఆమోదముద్ర వేయించుకోవటమే ప్రధానం కాదని, అమలులో కూడా ఇదే వేగాన్ని, ఉత్సాహాన్ని చూపాలని సూచించారు. రుణ ప్రణాళికలో చెప్పినట్లు ప్రాధాన్య రంగాలకు తగినట్లుగా రుణాలిచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడపడానికి తోడ్పాటు అందించాలని కోరారు.

తమ ప్రభుత్వం అభివృద్ధికి, సంక్షేమానికి తగిన ప్రాధాన్యాన్నిస్తున్నదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కులరహిత సమాజం ఏర్పడటమే అంతిమ లక్ష్యమని, కానీ ప్రస్తుతం ఉన్న కాపు సామాజిక వర్గంలో, బ్రాహ్మణ సామాజికవర్గంలో ఎందరో దుర్భ పరిస్థితుల్లో ఉన్నాని, వీరి సంక్షేమానికి ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

ఎస్.టి, ఎస్సీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ప్రజలకు సామాజిక పెన్షన్లు సామాజిక భద్రతలో భాగమని వివరించారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తామని స్పష్టం చేశారు.

‘ప్రతి ఇంటికీ తాగునీరు-ప్రతి పొలానికి సాగునీరు’ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 5,000 కి.మీ సిమెంట్ రోడ్ల నిర్మాణం తమ ధ్యేయమని వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలన్న సంకల్పంతో విద్యుత్ భద్రత, నీటి భద్రత, గ్యాస్ భద్రత, ఆహార భద్రత, పశువులకు పశుగ్రాస భద్రత కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి గ్రామంలో వ్యక్తిగత మౌలిక వసతులు, సామాజిక మౌలిక వసతులు పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెక్నాలజీతో మేలైన పద్ధతులు (బెస్ట్ ప్రాక్టీసెస్) అనుసరించి ప్రజలకు వేగంగా సేవలందించవచ్చని సూచించారు.

స్వయం సహాయక మహిళలే ఇక బ్యాంకింగ్ కరస్పాండెంట్లు

కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు: ముఖ్యమంత్రి

గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలే ఇకపై బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా పనిచేస్తారని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జూలై 1 నుంచి కృష్ణా జిల్లాలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని చెప్పారు.

వ్యవసాయదారులు తక్కువ ఖర్చుతో సేద్యం చేయాలన్నది తన లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. లాభసాటి వ్యవసాయం, కరవు రహిత రాష్ట్రం ఈ రెండు మహోన్నత లక్ష్యాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పంటటసంజీవని పథకం కింద రాష్ట్రంలో 10 లక్షల పంటకుంటలను తవ్వే పథకాన్ని చేపట్టామని, జలసంరక్షణ పద్ధతుల ద్వారా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే పద్ధతులను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

రాయలసీమలో 3 టీఎంసీల భూగర్భ జలాలు పెరిగాయని, ఒక్క టీఎంసీ నీటితో లక్ష ఎకరాలు సాగయితే 19 టీఎంసీలతో 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వచ్చని వివరించారు. తాము చేపట్టిన ‘నీరు-చెట్టు’ పథకంటో భూగర్భ జలాలు పెరిగాయని ముఖ్యమంత్రి ఉదహరించారు.

రాష్ట్రంలో 63% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారని, వారి సంక్షేమానికి, మనుగడకు, వ్యవసాయాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
పెరిగిన రుణ ప్రణాళిక

ఇదిలా ఉంటే 2015-16 బాంకర్ల వార్షిక రుణప్రణాళిక రూ 1,25,748 కోట్లు కాగా, 2016-17 ఆర్ధిక సంవత్సరానికి రూ.1,65,538 కోట్లుగా నిర్ణయించారు.