Lasya Nanditha : లాస్య నందితను వెంటాడిన మృత్యువు.. వరుసగా మూడు ప్రమాదాలు.. కానీ ఈసారి..


కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈరోజు ఉదయం పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను మృత్యువు వెంటాడుతోందా అన్నట్లుగా వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

గతేడాది డిసెంబర్ లో సికింద్రాబాద్‌లో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే లాస్య నందిత వెళ్లగా.. ఆమె లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయారు. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్‌ డోర్లు బద్దలు కొట్టి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత పది రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో కూడా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్వల్పగాయాలతో బయటపడగా, హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో మాత్రం ఆమె మృత్యువు నుండి తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆమె మృతికి బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఇకపోతే గతేడాది ఫిబ్రవరి 19న సీనియర్‌ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణించడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందిత కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల్లోపే ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీంతో అటు కుటుంబ సభ్యుల్లోనూ ఇటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర విషాదం నెలకొంది.