ఏ. పి లో ఎనిమిదిన్నర లక్షల పంటకుంటల నిర్మాణం

CBN-Ap కరవు రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకుగాను చేపట్టిన 10లక్షల పంటకుంటల నిర్మాణాన్నిశరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం తన నివాసం నుంచే జలవనరులు, భూగర్భ జలాలు, వ్యవసాయ, వైద్యశాఖల అధికారులతో ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతి మండలంలో ఎంపీడీవో అధ్యక్షతన, జలవనరుల శాఖ ఏఈ నోడల్ అధికారిగా మండల రిసోర్స్ కమిటీలు ఏర్పాటుచేయాలన్నారు. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు ఎక్కడ నిర్మించాలి?ఎన్ని నిర్మించాలి? అనేదానిపై కసరత్తు చేయాలన్నారు. నీరు-చెట్టు, నరేగా, పంటకుంటల నిర్మాణ పనులపై ఈ కమిటీ ప్రతి మండలంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. భూగర్భ జల శాఖ ఏడీ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ గా వ్యవరించి జల సంరక్షణ కట్టడాల నిర్మాణ పనులపై శ్రధ్ద వహించాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 50 వేల పంటకుంటల నిర్మాణం పూర్తయ్యిందంటూ, మిగిలిన 8 లక్షల 50 వేల ఫార్మ్ పాండ్స్ నిర్మాణం ఈ మూడు నెలల్లో వేగవంతం చేయాలన్నారు. 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్న రైతుల పొలాల్లో, హార్డ్ సాయిల్ ఉన్నచోట్ల యంత్రాలను వినియోగించవచ్చన్నారు. అంతకంటే తక్కువ భూమి ఉన్నచోట్ల మాత్రం మాన్యువల్ గానే పంటకుంటలను తవ్వాలని సూచించారు. నీరు-చెట్టు, నరేగా నిధులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా చేయాలన్నారు. చెరువుల కట్టలు, వాగులు వంకల ఫీడర్ ఛానళ్లను శుభ్రపరచాలని, జంగిల్ క్లియరెన్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వేసవిలో తాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా అవసరం లేకుండానే అన్ని గ్రామాలు,వార్డులలో నీటివనరుల పెంపుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.

వడదెబ్బ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఓఆర్ ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలని, సూచించారు. వైద్యశాఖ అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

ఉచిత ఇసుక ప్రయోజనాలు పేద కుటుంబాలకు దక్కాలన్నారు. మండల,జిల్లా స్థాయిలో ఇసుక తవ్వకాలపై కమిటీలు వేయాలని ఆదేశించారు. ఏ రీచ్ లో ఎవరు మోనోపలీగా వ్వవహరించినా అధికార యంత్రాంగం కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీ,ఎమ్మార్వో అన్నిస్థాయిల అధికారులు సమిష్టి బాధ్యతతో, సమన్వయంగా వ్యవహరించి ఇసుక అక్రమ తవ్వకాలకు కళ్లెం వేయాలన్నారు.

ఈ టెలీ కాన్పరెన్స్ లో 549 మంది పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వర రావు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పత్తిపాటి పుల్లారావు, వివిధ జిల్లాల కలెక్టర్లు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, జలవనరులు, వైద్యశాఖల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నవారిలో ఉన్నారు.