టొయామాతో ఏపీ దోస్తీ

AP-Japanఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో మరో అడుగు ముందుకుపడింది. జపాన్‌లోని అగ్ర రాష్ట్రం టొయామాతో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా అవగాహన ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంతో పాటు, అభిప్రాయలు, అనుభవాలను, సాంకేతిక నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. టొయామా గవర్నర్ తకకాజు ఇషి నేతృత్వంలోని 19మంది సభ్యులతో కూడిన జపాన్ బృందం అమరావతిలో రెండురోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ పర్యటన దరిమిలా జపాన్, ఇండియా సంబంధాలు మరింత దృఢపడుతున్న తరుణంలో ఏపీ, టొయామా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేలిమలుపు కానుంది. జపాన్ బృందంలో టొయామా ప్రిఫెక్చర్‌కు చెందిన ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు వున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలలో సారూప్యత వున్నదని, టొయామా కూడా ఏపీలాగే విభజనతో వేరు పడి వందేళ్లలో బాగా అభివృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. అన్నిరంగాలలో టొయామో సాధించిన ప్రగతి నవ్యాంధ్రకు స్ఫూర్తిదాయకమని అన్నారు. 972 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, సహజ వనరులకు ఆలవాలమైన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలన్న ఒకే ఒక లక్ష్యంతో కృషి చేస్తున్నామని వివరించారు. పోర్టులు, మత్స్య పరిశ్రమ, సముద్ర ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు, బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి, టూరిజం, ఫార్మాస్యూటికల్ రంగాలలో టొయామా సహకారం ఆశిస్తున్నట్టు చెప్పారు. సమీప భవిష్యత్తులో భారతదేశం బలీయమైన ఆర్థిక శక్తిగా మారబోతోందని, దేశంలో అత్యంత వేగంగా వృద్ధి రేటు సాధిస్తున్న రాష్ట్రాలలో ఏపీ ముందువరుసలో వున్నదని ముఖ్యమంత్రి వివరించారు. టొయామాకు చెందిన పారిశ్రామిక సంస్థలు మౌలిక సదుపాయాలు, తయారీరంగంలో 71 దేశాలలో సత్తా చూపుతున్నాయని, అటువంటి రాష్ట్రంతో పరస్పర లబ్ధి పొందేలా అవగాహన కుదుర్చుకోవడం ఏపీ అభివృద్ధికి ఎంతో ఉపయుక్తం కానుందని సీయం అన్నారు.

ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ రంగంలో జపాన్‌లో అగ్రగామిగా వున్న రాష్ట్రం టొయామా ఏపీ ఫార్మారంగంలో కూడా అడుగుమోపాలని ఆహ్వానించారు. ఫార్మారంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుండేదని, దివీస్, రెడ్డీస్, అరబిందో, హెటిరో వంటి సంస్థలు ఇక్కడినుంచే అంతర్జాతీయస్థాయికి ఎదిగాయని గుర్తుచేశారు. టొయామా ఫార్మా కంపెనీలు వారికి వున్న అపారమైన అనుభవంతో ఏపీలో పెట్టుబడులకు ముందుకొస్తే ప్రపంచంలోనే నెంబర్ వన్ కాగల సత్తా తమకు వుందని ముఖ్యమంత్రి నమ్మకం వ్యక్తంచేశారు. దేశంలోని మూడు పారిశ్రామిక క్యారిడార్లలో రెండు ఏపీలో వున్నాయని, చెన్నయ్-విశాఖ, చెన్నయ్-బెంగుళూరు క్యారిడార్లే కాకుండా విశాఖ, తిరుపతి-ఏర్పేడు, కృష్ణపట్నం నోడ్స్, అమరావతి సహా మరికొన్ని పారిశ్రామిక నగరాలు రాష్ట్రానికి ప్రధాన ఆకర్షణగా వున్నాయని వివరించారు. రెండు పారిశ్రామిక క్యారిడార్లకు, నోడ్స్, పారిశ్రామిక నగరాలకు మౌలిక సదుపాయాల కల్పనలో టొయామా ఇన్ ఫ్రా కంపెనీల అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

భారతదేశంలో పెట్టుబడులు పెట్టే విదేశాలలో జపాన్ నలుగవ అతిపెద్ద దేశంగా వున్నదని, భారత్‌కు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో జపాన్ వాటా 7శాతంగా వున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. భారతదేశంలో వున్న మొత్తం తీర ప్రాంతంలో 13శాతం ఏపీలోనే వుందని, సహజసిద్ధమైన ఓడరేవులు, అభివృద్ధి చేస్తున్న మరో 7పోర్టులతో ఏపీ ఆగ్నేయాసియా దేశాలకు ముఖద్వారం అవుతుందని అన్నారు. వ్యవసాయ ప్రధానంగా వుండే రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలతో పాటు, పర్యాటక, సేవారంగాలపై దృష్టిపెట్టినట్టు వివరించారు. ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్‌ను తయారుచేయాలన్నది తన సంకల్పంగా చెప్పారు. విజ్ఞానం, సృజనాత్మకతల్లో తెలుగువారు ఎప్పుడూ ముందుంటారని, టొయామా, ఏపీ మధ్య సాంస్కృతిక, వైజ్ఞానిక మార్పిడి జరిగితే అద్భుతాలు సాధించవచ్చునని అన్నారు.

టొయామా, ఏపీ విద్యార్థుల మధ్య పరస్పర మార్పిడి కార్యక్రమం నిరంతరం కొనసాగాల్సివుందని సీయం ఈ సందర్భంగా చెప్పారు. అక్కడ విద్యార్థులు ఇక్కడికి, ఇక్కడి విద్యార్థులు అక్కడికి వెళ్లి నేర్చుకోవడం ద్వారా పెద్దసంఖ్యలో మంచి ఎంటర్‌ప్రెన్యూర్లు తయారవుతారని అన్నారు.
కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని, విజన్ కలిగిన పటిష్టమైన నాయకత్వం వున్న ఏపీ త్వరలోనే సిలికాన్ వ్యాలీగా మారనున్నదని టోయామా గవర్నర్ తకకాజు ఇషి వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి తన జులై పర్యటనలో ఈ ఒప్పందం గురించి ప్రస్తావించారని, తరువాత ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని పంపి ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారని, పలుదఫాలుగా సాగిన సమగ్ర చర్చల తర్వాత ఇరు రాష్ట్రాల శక్తిసామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు ఈ అవగాహన ఒప్పందం కుదరిందని టొయామా గవర్నర్ చెప్పారు. టొయామా కూడా ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొని జపాన్‌లో అగ్రరాష్ట్రంగా ఎదిగిందని, ఏపీ కూడా ఇప్పుడు అదే స్థితిలో వుందని అన్నారు. అయితే, ఏపీలో వున్న సమర్ధమైన నాయకత్వం దృష్ట్యా టొయామో అభివృద్ధికి వందేళ్లు పట్టినట్టుగా ఇక్కడ అన్నేళ్లు అవసరం లేదని, అతి త్వరలోనే ఈ రాష్ట్రం అగ్రగామిగా మారుతుందని చెప్పారు. టొయామా, ఏపీ దీర్ఘకాలం నమ్మకమైన స్నేహితులుగా కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఇక్కడ తమకు లభించిన ఆత్మీయ ఆతిధ్యం మాటల్లో వర్ణించలేకపోతున్నామన్నారు.

ఫార్మారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి సహాయపడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు వీలుగా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేద్దామని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ఈ సమావేశంలో ప్రతిపాదించారు. శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు శ్రీ యనమల రామకృష్ణుడు, శ్రీ పత్తిపాటి పుల్లారావు, శ్రీ నారాయణ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పీవీ రమేశ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీ ఎస్ ఎస్ రావత్, టూరిజం కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్, సీఎంవో కార్యదర్శులు శ్రీ సతీశ్ చందర్, శ్రీ సాయి ప్రసాద్, శ్రీ రాజమౌళి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జపాన్ బృందంలో గవర్నర్‌తో పాటు టొయామా అసెంబ్లీ చైర్మన్ షకీ యెకోయోమా, చెన్నయ్‌లోని జపాన్ రాయబార కార్యాలయం కాన్సిలేట్ జనరల్ సైజీబాబా, ఎఫ్‌టీపీసీసీ అండ్ ఐ చైర్మన్ షిగో టకాకీ, టొయామో ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ చైర్మన్ తొషీరో నకాయి, వైస్ ప్రెసిడెంట్ యెషినోబు ఒసుగా, వైకెకె ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ టకాషి ఇనోయీ, టొయామా-ఇండియా అసోసియేషన్ సలహాదారు రైకో హిరా వున్నారు.