చంద్రబాబుపై విరుచుకుపడ్డ సీఎం జగన్


చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారరని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కందకూరులో చంద్రబాబు పాల్గొన్న రోడ్ షోను ఉద్దేశపూర్వకంగా ఇరుకు రోడ్డులో నిర్వహించి అమాయకుల ప్రాణాలు పోయేలా చేశారని విమర్శించారు. గతంలో జరిగిన గోదావరి పుష్కరాల్లో కూడా ఇదే తరహా పబ్లిసిటీ కోసం 29 మంది ప్రాణాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. నర్సీపట్నంలోని మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.

గత ప్రభుత్వంలో ప్రతి వర్గాన్ని వంచించిన చంద్రబాబు సభకు జనం ఎందుకొస్తారని ప్రశ్నించారు. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసినందుకా.. అని ఎద్దేవా చేశారు. రుణ మాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను బాబు మోసం చేశారన్నారు. ఇవన్నీ చేసిన చంద్రబాబు సభకు జనం భారీగా వచ్చారని నిరూపించి పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నించారు. డ్రోన్ వీడియోలు భాగా వచ్చేందుకు ఇరుకు రోడ్డులో అమాయక కార్యకర్తలను తోసి వారి మరణాలకు కారణం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టి 8 మందిని చంపేశారన్నారు. రాజకీయాలంటే డ్రోన్ షూటింగ్‌లు కాదన్నారు. రాజకీయం అంటే డైలాగులు కాదు, డ్రోన్‌ షాట్‌లు, డ్రామాలు కాదని చంద్రబాబుకు సీఎం జగన్ సూచించారు. రాజకీయమంటే రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుపేద, మధ్య తరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తూ సర్వతోముఖాభివృద్ధి తీసుకురావడమని పేర్కొన్నారు.