సోనియాతో సీఎం కిరణ్ భేటీ

cm-kiran-soniagandhiఅధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్ళిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని, ముఖ్యంగా తెలంగాణ విషయంపై పూర్తి సమాచారాన్ని సోనియాగాంధీకి అందించినట్లుగా సమాచారం. తెలంగాణ అంశంపై సీఎం కిరణ్ తన అభిప్రాయాన్ని సోనియాగాంధీకి తెలియజేశారు. అయితే సీఎం అభిప్రాయం.. ఏ ప్రాంతానికి అనుకూలంగా ఉందనే విషయం రహస్యంగా ఉంచారని తెలుస్తోంది. దీంతో సీఎం రాష్ట్రంలో తొలివిడత సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయాన్ని కూడా సోనియాకు వివరించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మలిదశలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దాదాపు డిసిసిబిలన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని సోనియాగాంధీకి తెలియజేశారని తెలుస్తోంది.

అంతకుముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ గులాంనబీ ఆజాద్ ను కిరణ్ కుమార్ రెడ్డి కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో తెలంగాణ అంశంతో పాటు రాష్ర్టంలో పార్టీ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. కాగా, ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, మాజీ మంత్రి శంకర్రావు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆజాద్ అసంతృప్తి వ్యకం చేసినట్లు సమాచారం. కాగా, సీఎం కిరణ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.