జాప్యంతో జనజీవనం అయోమయం

Telangana-Issue-in-Andhra-Pradeshమొత్తానికి తెలంగాణా వాదుల నిరంతర పోరాటం ఫలితంగా ఎట్టకేలకు కాంగ్రెస్‌ అధిష్టానం అఖిలపక్ష భేటీ ఏర్పాట్లు చేయడం, డిసెంబర్‌ 28న జరిగిన ఆ భేటీ లో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తమ తమ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మద్దతు పలకడం… అందరి అభిప్రాయాలనూ విన్న తర్వాత కేంద్ర హోంశాఖామాత్యులు సుశీల్‌ కుమార్‌ షిండే నెలరోజుల్లోగా కేంద్రం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలపడం జరిగిపోయాయి. ఇంతవరకూ బాగానే ఉంది. దాదాపుగా ఇదే సీన్‌ మనం 2009లోనూ చూశాం. దాని తర్వాతే అసలైన లొల్లి షురూ అయింది. యూ టర్న్‌ లు, అన్ని రాజకీయ పార్టీల్లో చీలికలు, విభజన, సమైక్య వాదుల పరస్పర అభియోగాలూ మనం చూస్తూ వచ్చినవే! మళ్లీ ఇప్పుడు తాజాగా మొదలైన ఈ వివాదంలో కాంగ్రెస్‌ అధిష్టాన వర్గం మరోసారి ఈ గడ్డుకాలం ఎదుర్కోక తప్పేలా కనిపించడం లేదు.

ఓ వైపు కాంగ్రెస్‌ లోని తెలంగాణావాదులు కేంద్రం తమ నిర్ణయాన్ని ప్రకటించిన గడువు అయిన జనవరి 28 కంటే ముందుగానే ప్రకటించేస్తుందని, ఈ నెల 23న కేంద్రంలో జరగబోయే “చింతన్‌ బైఠక్‌” మేధోమధన సదస్సులోనే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మరికొందరయితే ఏకంగా కేంద్రం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగానే ఉందనీ, అయితే పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ను కొనసాగించేలా నిర్ణయం తీసుకోబోతున్నారని తమ వంతుగా స్టేట్‌ మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. దీనితో సమైక్యవాదుల్లో అలజడి మొదలయింది. మరి ఇంతకీ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం ఏది? అంటే మాత్రం ఖచ్చితంగా ఇదీ అని చెప్పడానికి ఎవరి వద్దా ఎటువంటి స్పష్టమైన నిర్ణయమయితే ఇంతవరకూ లేనట్టే అనేది మాత్రం ఖచ్చితం.

దాదాపుగా రాష్ట్రంలోని ప్రతీ రాజకీయపార్టీ కూడా ఈ పరిణామాలను తమ తమ రాజకీయ స్వప్రయోజనాల కోసమే మలుచుకునే పనిలో బిజీగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు, నాయకుల పరిస్థితి కూడా ‘ఇమ్మంటే ఇటువైపు, వద్దంటే అటువైపు దెబ్బలు తినాల్సి వచ్చేలానే ఉంది’ అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అందరి మధ్యనా పడి నలిగిపోతోంది మాత్రం సామాన్య ప్రజానీకమే అన్న విషయం గుర్తెరగక తప్పదు.

ప్రత్యేక తెలంగాణా ఇవ్వకపోతే తెలంగాణా వాదుల ధర్నాలు, బంద్‌ లు… ఒకవేళ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం వస్తే సమైక్య వాదుల ధర్నాలు, బంద్‌ లు… రెండింటిలో ఏదో ఒకటయితే తప్పనిసరి… బంద్‌ లో, ధర్నాలో జరిగితే సాధారణ జనజీవనం అస్తవ్యస్తమవడం పరిపాటే! ముందుగా పగిలేది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అద్దాలే.. అంటే జనం సొత్తే! ముందుగా ఛిద్రమయ్యేవి చిన్నపాటి సంపాదనల జీవితాలే! మూతలు పడేవి మన పిల్లలు చదువుకునే విద్యా సంస్థలే! బ్రేకులు పడేది మన భావిభారత పౌరుల చదువులకే!

ఇవన్నీ జరగకుండా ఉండాలంటే…. సమాధానం అగమ్యగోచరం… కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు… అందరూ కలిసి ఆలోచిస్తే ఏదో ఓ మంచి నిర్ణయం తట్టక పోదు.. కానీ అంత తీరికా, అంత ఆలోచనా వారిలో ఉంటుందా? అన్నదే సమాధానం లేని కొండెక్కి కూర్చున్న కోతి లాంటి మిలియన్‌ డాలర్‌ ప్రశ్న!!!