Cyber Crime : సరికొత్త సైబర్‌ మోసం.. ఓటీపీ, లింక్‌ లేకుండానే ఖాతాలో డబ్బు స్వాహా !


దేశవ్యాప్తంగా సైబర్ మోసాల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిత్యం ఓ అడుగు అడ్వాన్స్‌గా ఉంటూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు. జనాలు ఎలాంటి మోసాలకు గురికాకుండా ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కేటుగాళ్లు మాత్రం మోసం చేయడానికి సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల తెలివికి.. అమాయకులు మాత్రమే కాదు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్స్ కూడా మోసపోతున్నారు. తాజాగా మరోకొత్త మోసం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఓ మహిళ మెసేజ్ ఓపెన్ చేసి లక్ష్య పోగొట్టుకుంది.

వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయిన 43 ఏళ్ల మహిళ సైబర్‌ నేరగాళ్ల చేతిలో పడి మోసానికి గురైంది. ఎలాంటి ఓటీపీ, లింక్ పంపకుండానే.. మహిళ డిజిటల్ వాలెట్ నుంచి రూ. లక్ష నగదును కేటుగాళ్లు డ్రా చేశారు. సైబర్ నేరగాళ్ల ఈ కొత్త పద్ధతి తెలిసి ప్రజలు, పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. దుండగుడు తన తండ్రి పేరును వాడుకుని రూ. 1 లక్ష రూపాయలు స్వాహా చేసాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఎలాంటి ఓటీపీ కానీ, లింక్‌ను క్లిక్ చేయలేదని చెప్పింది.

‘తెలియని నంబర్ నుండి నాకు కాల్ వచ్చింది. కాలర్ హిందీలో మాట్లాడాడు. నా తండ్రికి స్నేహితుడు అని చెప్పాడు. అతడు నన్ను డబ్బు పంపమని నా ఫోన్‌కు ఓ మెసేజ్‌ పంపాడు. మెసేజ్‌ ఓపెన్ చేసి చూశా తప్ప ఎలాంటి ఓటీపీని షేర్ చేయలేదు. లింక్‌పై కూడా క్లిక్ చేయలేదు.15 నిమిషాల్లోనే నా ఖాతా నుంచి లక్ష రూపాయలు డ్రా అయ్యాయని నాకు మెసేజ్‌ వచ్చింది’ అని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. డబ్బు చోరీకి అనుమతించే కోడ్‌తో టెక్స్ట్ సందేశాలు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయని సైబర్ క్రైమ్ నిపుణులు అంటున్నారు.