సమైక్యాంధ్ర కాంగ్రెస్‌ లో డైలమా?

DL-Gantaసమైక్యాంధ్ర కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు నిన్న మినిస్టర్‌ క్వార్టర్స్‌ లో జరిపిన సమావేశంలో ఓ విధంగా నెగెటివ్‌ రిజల్ట్స్‌ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరికి తోచిన రీతిలో వారు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఇక రాజీనామాలేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలని చూస్తే హైకమాండ్‌కు తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే రాష్ట్రాన్ని విభజించాలనా? బాబు కాంగ్రెస్‌ తొత్తా? అని ఆయన విమర్శించారు. మరోవైపు మరో సీమాంధ్ర ఎమ్మెల్యే, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి రాజీనామాలపై సీమాంధ్ర సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణపై ఎలాంటి నిర్ణయం వచ్చినా ఎవరూ రాజీనామా చేయరని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని డీఎల్ స్పష్టం చేశారు. తామెవ్వరం ఢిల్లీకి వెళ్లటం లేదన్నారు. సమైక్యాంధ్ర కోరుతూ తీర్మానంపై సంతకం పెట్టానని డీఎల్ తెలిపారు. తెలంగాణ ఇస్తున్నట్టు అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఇస్తారన్నది మీడియా సృష్టేనని పేర్కొన్నారు.