అమరావతి పీఠం ఎవరిదీ..?

దేశ వ్యాప్త సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో తేలనుంది..ఇన్ని రోజులు గెలుపు మాదంటే మాది ..అని చెప్పకున్న నేతలకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారనేది తేలనుంది. 542 మంది లోక్‌సభ సభ్యులకుగాను 8,049 మంది బరిలో నిలవగా, ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో 90 కోట్ల మంది అర్హులైన ఓటర్లలో 67 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈసారి 67.11 శాతంగా నమోదైన ఓటింగ్‌ శాతం భారత పార్లమెంటరీ ఎన్నికల్లో అత్యధికమని ఈసీ అధికారులు పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా, ఈవీఎంల్లోని ఓట్లను వీవీప్యాట్‌ చీటీలతో సరిపోల్చనున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని ఐదు కేంద్రాల్లో ఈ ప్రక్రియను అమలు చేయనున్నారు. మొత్తం సుమారు 10.3 లక్షల పోలింగ్‌ కేంద్రాలకుగాను, 20,600 కేంద్రాల్లో ఇలాంటి లెక్కింపు జరుగనుంది. వీటిని సరిపోల్చడంలో తేడాలు వస్తే, వీవీప్యాట్లలోని కాగితం చీటీల లెక్కింపునే తుది ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియంతటికీ అదనంగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం తీసుకుంటుందని ఈసీ అధికారులు పేర్కొన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు, ఓటర్ల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. 40 రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. ఎవరు అమరావతి పీఠం దక్కించుకుంటారో అన్న ఉత్కంఠకు నేటితో తెరపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ కాసేపట్లో మొదలైపోతుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అరగంటకు ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఒకవేళ అరగంటలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తికాకపోతే దానికి సమాంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. ప్రతి రౌండ్‌కు ఫలితాలు వెల్లడిస్తారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే ..తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు సంబందించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. 35 కేంద్రాల ద్వారా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో ఏడు ప్రాంతాల్లో, సికింద్రాబాద్‌ నియోజకవర్గం ఓట్లను ఆరు ప్రాంతాల్లో లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. పార్టీల ఏజెంట్ల సమక్షంలో తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను తెరుస్తారు. తిరస్కరించిన ఓట్ల కన్నా మెజార్టీ తక్కువగా ఉంటే వాటిని మళ్లీ లెక్కిస్తారు.వాటి లెక్కింపు పూర్తయ్యాక ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదయం 8.20 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఉత్కంఠ కు తెరపడే సమయం వచ్చింది.