కేసీఆర్ దత్తత గ్రామాలకి.. గోదావరి నీళ్లు !

kcr
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకొన్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు ఏ జన్మలోనో అదృష్టం చేసుకొన్నట్టు ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ తన దత్తత గ్రామాలపై వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న డబుల్ బెడ్ రూం పథకాలని కూడా ఈడనే మొదట స్టార్టు చేసిండ్రాయె. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా కేసీఆర్ దత్తత గ్రామాల అభివృద్ధిని చూసి మురిసిపోయిండు.

తాజాగా, ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు మరో హామి ఇచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ గ్రామాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్… రాబోయే రెండేళ్లలోపు ఈ గ్రామాలకి గోదావరి నీళ్లు తీసుకొస్తానని చెప్పిండు. ప్రస్తుతం డ్రిప్‌ ఇరిగేషన్‌ పనులు జరుగుతున్నాయి.. గోదావరి జలాలు వస్తే నీళ్లకు ఢోకా ఉండదన్నారు కేసీఆర్ సారూ. ఈ రెండు గ్రామాల విషయంలో ఇప్పటి వరకు హామి ఇచ్చిన పనులన్నీ చేసిండు గులాభి అధినేత. ఇప్పుడు గోదావరి నీళ్ల హామి కూడా ఇచ్చిండు. గది కూడా నెరవేర్చుడు పక్కాగా కనిపిస్తుంది.

దత్తత గ్రామాలు ఎర్రవెల్లి, నర్సన్నపేట మాదిరిగానే తెలంగాణ గ్రామాలన్నింటిని అభివృద్ధి చేస్తే బాగుంటది కదా.. అని తెలంగాణ లోకం ఆశపడుతుంది. ఎటుగిడిక ఫాం హౌస్ దగ్గరుందని గీ రెండు ఊర్లని బాగు జేస్తె ఎట్ల. మిగిలిన గ్రామాలని కూడా అభివృద్ధి జేస్తే బాగుంటదని అంటుర్రు. మరి.. వీరి బాధ కేసీఆర్ కి ఎప్పుడు అర్థమవుతుందో.. ? తెలంగాణలోని అన్ని గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్న పేట గ్రామాల మాదిరిగా ఎప్పుడు అభివృద్ధి చెందుతాయో చూడాలి మరి.. !