ఎర్రగడ్డకు టీ-సచివాలయం?

41422398368_625x300
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎర్రగడ్డకు చేరనుంది. ఇదేదో.. రాజకీయ నాయకుడు చేసిన విమర్శ కాదులేండీ.. ! నిజంగానే కేసీఆర్ సర్కారు సచివాలయాన్ని ఎర్రగడ్డు షిఫ్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే.. ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్న ప్రభుత్వ క్షయ (టీబీ), ఛాతీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి తరలించనున్నారు. ఈ మేరకు నిన్న (మంగళవారం) ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ప్రస్తుతం నగరం నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనాల మరో విధంగా ఉపయోగించుకోనున్నారు. అవసరమైతే.. 25 ఎకరాల్లో వున్న ఈ విలువైన స్థలాన్ని విక్రయించడం ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. అంతేకాకుండా.. హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం నెరవేరుతుందని టీ-యోచిస్తోంది.

ఎర్రగడ్డకు సచివాలయం అంశంపైనా.. ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతంగానే చర్చిస్తున్నారు. కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఎలా ఉండాలి.. అందులో ఎన్ని బ్లాక్‌లుండాలి.. ఎన్ని అంతస్తులుండాలి అనే వివరాలను సైతం సీఎం చర్చించినట్లు సమాచారమ్. తాజా ప్రతిపాదనల ప్రకారం కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేకంగా ఒక బ్లాక్ కేటాయిస్తారు. ఏడు నుంచి ఎనిమిది అంతస్థుల భవనంలో సీఎం బ్లాక్ ఉంటుంది. మంత్రులకు సంబంధించి ఆరు నుంచి ఎనిమిది బ్లాక్‌లు నిర్మించనున్నారు.

మరోవైపు, టీ-సర్కార్ నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. చరిత్రాత్మక చరిత్ర గల సచివాలయాన్ని మార్చే అవసరమేముందని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నేతలకే కాదు.. సాధారణ ప్రజలకు కేసీఆర్ నిర్ణయం కాస్త ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. కేసీఆర్ నిర్ణయం ప్రజలు కాస్త ఆగ్రహంతోనే వున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. సచివాలయ మార్పు ఎంత మేరకు కార్యరూపం దాల్చనుందన్నది ప్రశ్నార్థకమే.