తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం.. ఆ జిల్లాల్లో అధికం


తెలంగాణలో నిన్నటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రాత్రి నుంచి హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో కూడా కుండపోతగా వాన పడింది. ఈ రోజు ఉదయం వరకు మేఘావృతమైన భాగ్య నగరంలో చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి. ఇక ఈ నెల 16 నుంచి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. జార్ఖండ్ నుండి ఛత్తీస్ ఘడ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో.. తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తారు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇక, ఏ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాలను కూడా వేసింది వాతావరణశాఖ.. ఇవాళ, రేపు, ఎల్లుండు శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, కడప , తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయిని పేర్కొంది. ఇదే సమయంలో ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్‌ ఉందని పేర్కొంది. ఈ సమయంలో.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.