జూన్‌లో ఇండో-యూకే ప్రాజెక్టు శంకుస్థాపన

indo-UK-projectకొత్త రాజధాని నగరం అమరావతిలో తలపెట్టిన ప్రతిష్టాత్మక మెగా హెల్త్ కేర్ ప్రాజెక్టుకు జూన్ నెలలో శంకుస్థాపన జరగనున్నది. ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌ (ఐయుఐహెచ్) ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ మెడికల్ ప్రాజెక్టులో భాగంగా రూ.1000 కోట్లతో వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని, వెయ్యి పడకల మెగా ఆస్పత్రిని నెలకొల్పుతారు. వీటికి అనుబంధంగా మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ యూనిట్, మెడికల్ డేటా అనలిటిక్స్ సెంటర్, వైద్య సంబంధిత విభాగాలు, పరిశోధన, శిక్షణా సంస్థలను ఏర్పాటుచేస్తారు. మొత్తం అన్ని విభాగాలు కలిపి ‘హెల్త్ కేర్ సిటీ’గా వ్యవహరించే ఈ మెగా ప్రాజెక్టును 2018 జూన్‌ నాటికి పూర్తిచేసి ప్రారంభించడానికి ఐయుఐహెచ్ సన్నాహాల్లో ఉంది. ఇందులో భాగంగా ఐయూఐహెచ్ ప్రతినిధుల బృందం ఈనెల 25, 26 తేదీలలో అమరావతిలో పర్యటించనుంది.

దేశంలో ఐయుఐహెచ్ నిర్మించతలపెట్టిన మొత్తం 11 మెగా మెడికల్ ప్రాజెక్టులకు అమరావతిని హెడ్‌క్వార్టర్‌గా చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చేసిన సూచన మేరకు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ హెల్త్‌ కేర్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. దేశంలో ఏర్పాటయ్యే 11 ఆసుపత్రులు, విశ్వ విద్యాలయాలు, ఇతర విభాగాలకు అమరావతి కేంద్ర కార్యాలయంగా వుంటుంది. ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగడమే కాకుండా అవసరమైన వైద్య పరికరాల తయారీ కూడా అమరావతి కేంద్రంగా జరగనున్నది.

ఈ ప్రాజెక్టు స్థాపనపై గత ఫిబ్రవరిలో విశాఖలో ఐయుఐహెచ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. దరిమిలా యూకే బృందం మార్చి నెలలో అమరావతిని సందర్శించి ఆసుపత్రిని నెలకొల్పే ప్రాంతాన్ని పరిశీలించింది. ఇక్కడ ఏర్పాటుచేసే విశ్వవిద్యాలయం, ఇతర విభాగాలకు యూకేలో వున్న ప్రపంచస్థాయి వైద్యకేంద్రంతో అనుసంధానం చేస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన వైద్యం భారతదేశంలోనే లభించేవిధంగా ఆ ఆసుపత్రిని తీర్చిదిద్దుతారు. దేశంలో నెలకొల్పుతున్న 11 మెగా ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలకు యుకే ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ సర్విసెస్(ఎన్‌హెచ్ఎస్) ఐయూఐహెచ్‌కు భాగస్వామిగా వుంటుంది. యూకేలో ప్రఖ్యాత ఎలరా క్యాపిటల్ ఈ ప్రాజెక్టుకు నిధులు అందించనుంది.

అమరావతి ప్రాజెక్టుకు లండన్‌లోని విఖ్యాత కింగ్స్ ఆసుపత్రి భాగస్వామిగా వుంటుంది. ప్రధానమంత్రి గత ఏడాది బ్రిటన్ పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా ఐయుఐహెచ్ హెల్త్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చొంది.

అమరావతి ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, నిర్మాణదారు ఎంపిక దాదాపు పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఇడీబీ) ద్వారా సంబంధిత వివరాలు ఏపీ ఉన్నత విద్యాశాఖకు, వైద్య ఆరోగ్యశాఖకు ఇప్పటికే అందించారు.

ఇలావుంటే, 25 నుంచి అమరావతిలో పర్యటించనున్న యూకే బృందం తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం కేటాయించనున్న 150 ఎకరాల స్థలంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 26న అమరావతి ప్రాంతంలోని ఈ స్థలాన్ని సందర్శించి సీఆర్‌డీఏ అధికారులతో చర్చిస్తుంది. చివరగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడుతో సమావేశమవుతుంది.

బృందంలో ఐయూఐహెచ్ ఎండీ, గ్రూపు సీఈవో అజయ్ రజన్ గుప్తా, ఐయూఐహెచ్ చైర్మన్ ప్రొఫెసర్ మైక్ పార్కర్, ఎలరా క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అవినాశ్ కాలియా, డిపార్టుమెంట్ ఆప్ ఎన్‌హెచ్ఎస్‌కు చెందిన మైక్ నితావ్రియానకిస్, కింగ్స్ హాస్పటల్ బోర్డు మెంబర్ వినయ్ సింఘాల్, ఇన్వెస్ట్ ఇండియా తరుపున ఉదయ్ ముంజల్, ఐయూఐహెచ్‌ ప్రతినిధి విక్టోరియా లూషర్ వున్నారు.