Tirupati : యోగ‌ నర‌సింహుడి అవతారంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి


శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామివారు సింహ‌ వాహనంపై యోగ‌ నర‌సింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి సింహ వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు కటాక్షిస్తారు.