ఎన్టీఆర్ ని వ్యతిరేకించిన కెసిఆర్

kcr and ntr

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని గుర్తు చేసుకున్నారు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలాల కమిటీలో తాను సభ్యుడినని, తొలుత ఆ విధానాన్ని తాను వ్యతిరేకించినప్పటికీ, మండలాల ఏర్పాటు విజయవంతమైందని, అదే కోణంలో కొత్త జిల్లాల ఏర్పాటు మంచి ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు కేసిఆర్.

తెలంగాణ ఉద్యమ సమయంలోనే ప్రొఫెసర్ జయశంకర్, ఆర్.విద్యాసాగర్ రావు సమక్షంలో జిల్లాల విభజనపై చర్చ జరిగిందని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చెరువుల పునరుద్ధరణ, జిల్లాల విభజన అత్యంత శాస్త్రీయంగా జరపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. జిల్లాల విభజన అనేది రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ కారణాలతో జరగకూడదని, ప్రజాభీష్టం మేరకే జరగాలని అన్నారు. జిల్లాల విభజనలో ప్రజాభీష్టం మేరకు మార్పులు, చేర్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
 
సీఎం అధికారిక నివాసంలో పలు జిల్లాల  నేతలు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించి, వారికి దిశా నిర్దేశం చేశారు.