కృష్ణా,గోదావరి సంగమ ప్రదేశం దగ్గర ‘పవిత్రహారతి’

Pavitraharathiకృష్ణాపుష్కరాల సందర్భంగా గోదావరీ, కృష్ణానదీ సంగమ ప్రదేశం దగ్గర ఇచ్చే హారతికి ‘పవిత్ర హారతి’ అని పేరు పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ ‘పవిత్రహారతి’ కార్యక్రమాలకు పీఠాధిపతులను ఆహ్వానించాలని కోరారు. సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
పుష్కరాలకు ఇంకా 24 రోజులే సమయం ఉన్నందున ఈ నెలాఖరుకల్లా పుష్కరాల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికి 50% పనులు మాత్రమే పూర్తయ్యాయని. మంజూరు చేసిన పనులు సకాలంలో పూర్తిచేయాల్సిన బాధ్యత ఆయా శాఖాధికారులదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు ఒకటో తేదీన మరో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, అప్పటిలోగా పనులు పూర్తిచేయని కంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బాగా పనిచేసిన అధికారులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు.

గోదావరి పుష్కరాల్లో పనిచేసిన అనుభవం ఉన్న అధికారుల సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలని, బారికేడింగ్ పకడ్బందీగా ఉండాలని సీఎం ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ముందే కార్యాచరణ పథకం సిద్ధం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఇందుకోసం వారంలోగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.

భక్తులు నడిచేందుకు, పుష్కరఘాట్లను చేరేందుకు రహదారులకు ఓవైపు బారికేడ్‌లను నిర్మించి సౌకర్యవంతంగా వుండేలా చూడాలని అన్నారు. అంబులెన్స్‌లు అందుబాటులో వుంచడంతో పాటు ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై, సౌకర్యాల కల్పనపై 95 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని, అదే స్ఫూర్తితో మరింత మెరుగ్గా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

భక్తుల పుష్కర స్నానాలకు వీలుగా సాధ్యమైనంత వరకు ఘాట్ల దగ్గర నీరు స్వచ్ఛంగా వుండేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రతి రోజూ అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును, నాణ్యతను అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని కోరారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా సదుపాయాల కల్పనలో స్వచ్ఛంద సంస్థలు ప్రశంసనీయపాత్ర పోషించాయని ముఖ్యమంత్రి చెప్పారు. పుష్కర యాత్రికులకు అన్నదానానికి, వసతి కల్పనకు రైసుమిల్లర్ల సంఘాలు, అక్షయపాత్ర, రోటరీ క్లబ్బులు, ఇతర స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రోత్సహించి పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. భక్తులకు లోటులేకుండా, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణా నదీతీరాన ఉన్న దేవాలయాల అలంకరణ ఏర్పాట్లు వేగవంతంగా పూర్తిచేయాలన్నారు.

విజయవాడ, గుంటూరులో పూర్తిగా ఎల్ఈడీ వీధిదీపాలు

విజయవాడ, గుంటూరు నగరాల్లో ఎల్ఈడీ బల్బులను అమర్చాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ఆగస్ట్ 1 నాటికి పుష్కర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ శోభ తీసుకురావాలని తెలిపారు. పుష్కరాలను ముందు తరాలు గుర్తుంచుకునేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఫుడ్ ఫెస్టివల్స్, లేజర్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు

పుష్కరాలు నిర్వహించే కృష్ణా, గుంటూరు, కర్నూలు మూడు చోట్ల ఫుడ్ ఫెస్టివల్స్, రెండు చోట్ల లేజర్‌షోలు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పుష్కరాలు జరిగే 12 రోజులూ కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పన్నెండు రోజూల 12 సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు.
భారీఎత్తున తరలివచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రైవేట్ పార్కింగ్ ప్లేస్‌లను కూడా గుర్తించినట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పుష్కరాల ముగింపు ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించారు.

రూ. 1,277.87 కోట్లతో పుష్కరాల అభివృద్ధి పనులు

పుష్కరాల కోసం కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రూ. 216.42 కోట్లతో 379 పనులు పంచాయతీరాజ్ శాఖ చేపడుతుండగా, రూ. 239.63 కోట్లతో 314 పనులను పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ పూర్తి చేస్తాయి. రూ. 139.65 కోట్లతో 583 పనులను దేవాదాయ శాఖ, రూ. 334 కోట్ల విలువైన 188 పనులను జలవనరుల శాఖ చేపట్టాయి. అన్ని శాఖలు కలిసి రూ. 1,277.87 కోట్ల అంచనా వ్యయంతో 1,602 అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నాయి. ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకోని పనులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ‘ఏడు పర్యాయాలు ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు పూర్తయిన తర్వాత కూడా పనుల్లో అలసత్వం ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోనని హెచ్చరించారు. పనులు తీసుకుని సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్ల పై కఠిన చర్యలు తప్పవన్నారు.

కెమేరాలు, డ్రోన్లతో నిఘా, వచ్చేనెల ఒకటో తేదీకి కంట్రోల్ రూమ్

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కెమెరాలు అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట్ల డ్రోన్లు కూడా అందుబాటులోకి తేవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఆగస్ట్ ఒకటో తేదీకల్లా కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాధమికచికిత్స, అంబులెన్సులు, మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంచార వైద్య శాలలు, అంబులెన్సులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పుష్కరయాత్రికులకు అవగాహన కల్పించాలని సీఎం కోరారు. సమీక్షకు కొంతమంది ఉన్నతాధికారుల గైర్హాజరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిరోజూ 2,450 బస్సులు

కృష్ణవేణీ పుష్కరాలకు ప్రతిరోజూ 2,450 బస్సులు నడుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇవే కాకుండా ప్రతి జిల్లాలో 500 బస్సులను రద్దీకి అనుగుణంగా అందుబాటులో ఉంచుతామన్నారు. గోదావరి అంత్య పుష్కారాలకు కూడా ఏర్పాట్లు చేయాలని, రెండూ ఒకేసారి రావడం శుభపరిణామని ముఖ్యమంత్రి అన్నారు. పుష్కరాలంటే దేవతలను, పితృదేవతలను కొలిచే ఒకే ఒక సందర్భమని చెప్పారు. పితృదేవతలకు తర్పణలు వదలటానికి పురోహితులు అందుబాటులో ఉండేలా చూడాలని, తర్పణకు అవసరమైన వస్తువులు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా చూడాలని, డ్వాక్రా సంఘాలను ఈ వస్తువుల విక్రయంలో భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

సమావేశంలో ఉపముఖ్యమంత్రి శ్రీ. కెయి. కృష్ణమూర్తి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ పైడికొండల మాణిక్యాల రావు, రవాణా శాఖ మంత్రి శ్రీ సిద్ధా రాఘవరావు, అబ్కారీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.