ఏపీ ప్యాకేజీపై కేటీఆర్ కామెంట్

ktr (6)
పునర్విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇస్తామన్న రాయితీలను ఇవ్వాలని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కోరారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఇవాళ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమైన మంత్రి కేటీఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రానికి ఆర్థిక‌ సాయం చేస్తే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదని, ఏపీకి సాయం చేయడం మంచిదేనని, అయితే రెండు రాష్ట్రాల‌ను స‌మంగా చూడాల‌ని, లేదంటే తెలంగాణ ప్రజలు కేంద్రాన్ని తప్పుబట్టే ప్రమాదం ఉంద‌ని అన్నారు.

బీఆర్‌జీఎఫ్ కింద జిల్లాలకు ఇచ్చే నిధుల్లో రెండో విడత సాయం తెలంగాణకు అందలేదని , ఏపీకి ఇచ్చినట్లే తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థికసాయమందించాలని కోరినట్లు చెప్పారు.

పునర్ వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలను జైట్లీ నెరవేరుస్తామన్నారని చెప్పారు. దీంతో పాటు హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్, హైద‌రాబాద్ నాగ్‌పూర్ ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్‌నుకోరామని, మిష‌న్ భ‌గీర‌థ, మిష‌న్ కాక‌తీయ‌ల‌కు నిధులు విడుద‌ల చేయాలని కోరిన‌ట్లు చెప్పారు కేటీఆర్.