రాయ్ గడ్ దుర్ఘటనలో 25కి చేరిన మరణాల సంఖ్య


మహారాష్ట్రలోని రాయ్ గడ్ లో జరిగిన దుర్ఘటనలో మరణాల సంఖ్య 25కి చేరింది. ఇర్షాల్వాదీ గ్రామంలో కొండచరియలు విరిగిపడడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాదితులను కాపాడేందుకు విపత్తు నిర్వహణ శాఖ రంగంలో దిగింది. సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ముంబై నుంచి 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో మూడు రోజుల క్రితం కొండచరియలు విరిగిపడడంతో దాదాపుగా 17 ఇళ్లు నేలమట్టం అయ్యారు. అందులో నివసించే ప్రజలు ఇరుక్కుపోయారు. దాదాపు 100 మంది ప్రజల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

దుర్ఘటన జరిగిన కొద్దసేపటికే అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపడుతోంది. గురువారం నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దుర్ఘటన జరిగిన ప్రాంతానికి చేరడం చాలా కష్టసాధ్యమైన పని కావడంతో సహాయ కార్యక్రమాలు నత్త నడకన సాగుతున్నాయి.

బాధిత ప్రాంతానికి చెందిన దాదాపు 100 మంది మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేను కలిసి తమ బాధను వ్యక్తం చేశారు. ఆదుకోవాలని కోరారు. ప్రమాదం నుంచి బయట పడిన వారిలో చాలా మంది తమ తమ ఆప్తులను కోల్పోయారు. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. తమ కుటుంబంలో ఆర్జించే వ్యక్తి కోల్పోవడంతో చాలా మంది దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ షెల్టర్ హోంలో ఉన్నారు. అక్కడే వీరందరినీ కలిసిన ఉద్ధవ్ థాక్రే వారికి భరోసా కల్పించారు. అండగా నిలుస్తానని ధైర్యం నూరిపోశారు. అందరూ పూర్తిగా కోలుకునే వరకు తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.