బెంగళూరులో డబ్బులు వెదజల్లిన యువకుడు !


బెంగళూరు ఆర్కే మార్కెట్‌ కూడలిలో ఉన్న వంతెన పైనుండి హఠాత్తుగా ఓ యువకుడు సంచీ లోంచి డబ్బులు తీసి గాల్లోకి ఎగరేశాడు. వాటిని ఏరుకునేందుకు ఫ్లై ఓవర్‌ కింద జనం గుమిగూడారు. దీంతో మార్కెట్‌ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడున్న వారు సెల్‌ఫోన్లలో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. కేవలం 10 రూపాయల నోట్లనే విసిరినట్లు అక్కడున్న వారు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేశామని తెలిపారు.