గుడ్ న్యూస్.. హైదరాబాద్కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్.. దేశంలోనే తొలిసారిగా..


తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో హైదరాబాద్‌లో ఔటర్ రింగు రైలు(ORR) ప్రాజెక్ట్‌‌ చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ భారీ ప్రాజెక్ట్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసిందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల హైదారాబాద్ కు ఎంతో మేలు జరుగుతుందని.. ఈ తరహా ప్రాజెక్ట్ దేశంలోనే మొదటిదని చెప్పారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రైల్వే శాఖ కసరత్తు కూడా ప్రారంభించింనట్టు తెలిపారు. సర్వే కోసం కేంద్రం రైల్వే శాఖకు రూ. 14 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు (RRR) కు సమాంతరంగా ఈ ఔటర్ రింగు రైల్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఇక ఈ ప్రాజెక్ట్ జరిగితే రైలు కనెక్టివిటీ లేని ప్రాంతాలకు మేలు జరుగుతుందని అన్నారు.

కాగా 350 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ చాలా జిల్లాలను కలుపుతుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ, గుంటూరు, నిజామాబాద్, మెదక్, ముంబయి, వికారాబాద్‌ రైల్వేలైన్లతో అనుసంధానం చేస్తూ జంక్షన్లు ఏర్పటు చేయనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మార్గాల్లో వచ్చే ప్రజలు నగరంలోకి వెళ్లకుండానే ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరనే దిగి రోడ్డు మార్గంలో లేదా రైలు మార్గంలో తమ తమ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ కు రూ. 26 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపిన కిషన్ రెడ్డి.. దీనికోసం భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం కేంద్రమే భరిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగిందన్నారు. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని.. రూట్ ఎలా ఉండాలనే దానికి 99శాతం ఆమోదం లభించిందని చెప్పుకొచ్చారు. ఎంఎంటీఎస్ రెండో దశలో ఔటరి రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.