తెలంగాణ ప్రభుత్వ నియామకాల్లో అభ్యర్ధుల వయో పరిమితిని మరో 10 సంవత్సరాలు పెంచాలి

తెలంగాణ ప్రభుత్వ నియామకాల్లో అభ్యర్ధుల వయో పరిమితిని మరో 10 సంవత్సరాలు పెంచాలి. 34 నుంచి 44 సంవత్సరాలకు చేయాలి’’ అని డిమాండ్ చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఇటివలే టీఎస్‌పీసీ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ (3/2021) లో అభ్యర్థుల వయో పరిమితిని 34 ఏళ్లకు తగ్గించింది. దీని ద్వార 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో దూకుడుగా పాల్గొన్న నిరుద్యోగ యువత అవకాశాన్ని కోల్పోతున్నట్లు అవుతుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని వయో పరిమితిని 10 సంవత్సరాలకి (34 నుంచి 44) పెంచి సవరించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు దాసోజు. అంతేకాదు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని సామాజిక అత్యయక పరిస్థితిగా (సోషల్ ఎమర్జెన్సీ) ప్రకటించి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం హై లెవెల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువత, వారి కుటుంబాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓ బహిరంగ లేఖ రాశారు దాసోజు.

‘’తెలంగాణలో నిరుద్యోగ సమస్యతో పాటు కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నిరుద్యోగ యువతతో పాటు ప్రతి వ్యక్తి జీవితాన్ని కష్టాల్లో నెట్టింది. ఇందులో నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచారంగా వుంది. ఎప్పటికైనా తమ జీవితం బాగౌతుందని ప్రభుత్వ ఉద్యోగం కోసం, ఓ మంచి జీవనోపాధి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు.. వయో పరిమితిని 34 సంవత్సరాలకు తగ్గించడం వారి ఆశలపై నీళ్ళు చల్లినట్లయింది. నిరుద్యోగ యువతలో ఎక్కువమంది తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వారి తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితుల దగ్గర తలెత్తుకోలేకపోతున్నారు. వివాహం చేసుకోలేక, జీవితంలో స్థిరపడలేక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారిలో కొందరు నిస్సహాయతతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడు సంవత్సరాలలో కనీసం50పైగా యువత ఆత్మహత్య చేసుకున్నారు. గత వారం రోజుల్లో 7 మంది ఆత్మహత్యకు పాల్పడటం నిరుద్యోగ సమస్య తీవ్రతకు, క్షీణించిన యువత పరిస్థతికి అద్దం పడుతుంది’’ అని పేర్కొన్నారు దాసోజు.