శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌రావు కన్నుమూత..


శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్ రావు) గురువారం కన్నుమూశారు. హైద‌రాబాద్ లోని తన నివాసంలో ప్రమాదవశాత్తూ బాత్‌రూమ్‌లో జారిపడ్డ ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం బీఎస్​ రావు వయసు 75 సంవత్సరాలు. ఇక ఆయన భౌతికకాయాన్ని విజయవాడ తరలించనున్నారు కుటుంబ సభ్యులు. అక్క‌డే రేపు ఆయ‌న అంత్య క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఇకపోతే బీఎస్ రావు దంపతులు ఇంగ్లండ్, ఇరాన్ దేశాలలో డాక్టర్లుగా వైద్యసేవలు అందించారు. ఆతరువాత 1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థలను స్థాపించారు. తొలుత విజయవాడలో బాలికల జూనియర్‌ కళాశాల ప్రారంభించారు. తర్వాత అంచెలంచెలుగా ఆ సంస్థ శాఖలు విస్తరించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 321 జూనియర్‌ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సీబీఎస్‌ఈ స్కూల్స్‌ ఉన్నాయి.

ఇక ఎంసెట్, నీట్ వంటి పరీక్షల్లో శ్రీ చైతన్య తన మార్క్ ను చూపించింది. అగ్రస్థానంలో నిలిస్తూ.. విద్యావ్యవస్థలో సరికొత్త చరిత్రను సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది విద్యార్థులు ఈ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఇక శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. ఇకపోతే బీఎస్ రావు మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.