పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ముఖ్య గమనిక


తెలంగాణ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికార యంత్రంగం. ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు జగనున్నాయి. ఇప్పటి వరకు 11 పేపర్లతో పది పరీక్షలు నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం 6 పేపర్లకు కుదించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి పలు ముఖ్యమైన విషయాలను విద్యా శాఖ వెల్లడించింది. పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే బిట్‌ పేపర్‌ ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని తెలిపింది. అదేవిధంగా జనరల్‌ సైన్స్‌ పరీక్షలోని రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారిగా కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇవ్వాలని పేర్కొంది.

జనరల్‌ సైన్స్‌ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఫిజికల్‌ సైన్స్‌ , మరొకటి బయాలాజికల్‌ సైన్స్‌. జనరల్‌ సైన్స్‌లో తొలుత ఓ పేపర్‌ను ఇచ్చి దానికి సమాధానాలు రాసేందుకు 90 నిమిషాలు సమయం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం 20 నిమిషాల సమయం ఇచ్చి విద్యార్థులకు రెండో పేపర్‌ ఇవ్వాలని తెలిపారు. రెండో పేపర్‌ రాసేందుకు మరో 90 నిమిషాల సమయం కేటాయించాలని చెప్పారు. ఇక, మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నల పత్రాన్ని పరీక్ష చివరి 15 నిమిషాల ముందు ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు ఆ పదిహేను నిమిషాల్లోనే అందులోని పది ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పదోతరగతిలో అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది.