ఇస్తారో… ఇవ్వరో… తెలీదు కానీ…!

samaikhyandra telangana issueప్రశాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం, రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరం ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలతో హోరెత్తిపోతున్నాయి. అసలే వేడిమీదున్న వాతావరణాన్ని తమవంతుగా పలు రాజకీయ పార్టీల నాయకులు తమ వ్యాఖ్యలతో, వ్యాఖ్యానాలతో మరింత ఆజ్యం పోస్తున్నారు. ఇవన్నీ డిసెంబర్ 28కి ముందు దాదాపుగా లేవనే చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 28న ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేయడం జరిగింది. ఆ భేటీలో చాలా వరకూ రాజకీయ పార్టీలు తెలంగాణకు ఖచ్చితమైన అంగీకారం కాకపోయినా ఓ విధంగా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తపరచాయి. పార్టీలపరంగా చూసుకుంటే… అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఖచ్చితమైన అభిప్రాయం చెప్పలేదు. ప్రతిపక్ష తెలుగుదేశం 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తామిచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామంటూ.. ఏరుదాటేసింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ గోడమీద పిల్లివాటం ప్రదర్శించింది. మిగిలిన రాజకీయపార్టీలన్నీ ఏతావాతా ఓ విధమైన ఖచ్చితమైన నిర్ణయాన్నే ప్రకటించాయి. అయితే సదరు పార్టీల అభిప్రాయాలన్నీ భేటీ నుండి బయటకు వచ్చిన వెంటనే ద్వంద్వ ప్రమాణాలకు తెరలేపాయి. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తరపున హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తనవంతుగా మరో నెల రోజుల్లోగా అంటే జనవరి 28 వ తేదీలోపు ఈ విషయంలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ… తెలియజేయడం అటు తెలంగాణ వాదులకూ.. ఇటు సమైక్యాంధ్ర వాదులకు కట్టిమీద కునుకు లేకుండా చేసినట్టు అయింది. ఆరోజు మొదలుకొని తమ తమ ఆశయాలు నెరవేరే దిశగా ఎవరి లాబీయింగ్ ల్లో వారు బిజీ అయిపోయారు.

ఇక గడువు దగ్గరపడేకొద్దీ రాష్ర్టంలో వాతావరణం వేడెక్కుతూ..వస్తోంది. ఓ వైపు తెలంగాణ పెద్దతలలు తమకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం… మరో వైపు సమైక్యాంధ్ర నేతలు ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ తమవంతుగా తమ వాదాన్ని వినిపించడం లో తలమునకలవుతున్నారు. ఈ వ్యాఖ్యల పరంపర ఓ విధంగా అఖిలపక్ష భేటీ ముగిసిన వెనువెంటనే తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విలేకరులతో మాట్లాడుతూ భేటీపై తన అసంతృప్తిని తెలియజేస్తూ.. తెలంగాణ బంద్ కు పిలుపునివ్వడంతోనే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అటుపై పూటకో వెరైటీ కామెంట్ చొప్పున వింటూనే వస్తున్నాం.

తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తే చరిత్రలో మిగిలిపోతారని, అడ్డుతగిలితే ఆగమైపోతారని టి జేఏసీ కన్వీనర్ ప్రొ. కోదండరాం సీమాంధ్ర నేతలకు సూచించారు. హైదరాబాద్ మంత్రుల వైఖరి సిగ్గుపడేలా వుందని, తెలంగాణ కోరుకునేవారందరూ.. తమకు సహకరించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చుక్కా రామయ్య.. తెలంగాణ పై తలో మాట మాట్లాడుతున్నారని తెరాస నేత వినోద్ మండిపడ్డారు. ఇక బీజేపీ నేత బండారు దత్తాత్రేయ వెంటనే పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మరో తెలంగాణ కాంగ్రెస్ నేత కేకే తెలంగాణను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీచేశారు. ఎర్రవీరుడు నారాయణ అఖిలపక్షంలో అనుకూలమని చెప్పి ఇప్పుడు కొందరు టీడీపీ నేతలు తోకలు జాడిస్తున్నారని చురకలేసారు. తెలంగాణ నేతల కామెంట్స్ ఇలా ఉంటే.. ఇక సీమాంధ్ర నేతలు తామేమీ తక్కువ తినలేదని తమ తమ నాలుకలకు కూడా పనిచెప్పారు. తమవంతుగా కాంగ్రెస్ సీమాంధ్ర నేతల్లో 10మంది మంత్రులు 26 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఎన్నో నిరసనలు ఎదురైనా ఏకంగా భేటీ జరిపి ఆ భేటీలో 21న ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్ ముందు తమ వాదాన్ని వినిపించాలని తీర్మాణం చేశారు. ఆది నుండి కరడుగట్టిన సమైక్యవాదిగా పేరొందిన కాంగ్రెస్ ఎంపీ రాయపాటి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుపై సంకేతాలు వస్తున్నాయంటూ ఆ ప్రాంత నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూనే.. ఒకవేళ కేంద్రం సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడమంటూ జరిగితే.. సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారంటూ అల్టిమేటం జారీచేశారు. ఇక రాయలసీమ కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ వేదాంత ధోరణిలో తెలంగాణ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని పెదవి విరిచారు. “పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన చందాన సందట్లో సడేమియా” అంటూ హైదరాబాద్ మంత్రులు దానం, ముఖేశ్ లు తమవంతుగా హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ర్టం చేయాలన్న తమ పాత పాటను కొత్త రాగంలో మళ్ళీ పాడుతున్నారు.
అయితే ఇంతమంది నేతలు ఇన్ని విధాలుగా తమకు తోచిన రీతిలో మాట్లాడుతున్నప్పటికీ సదరు రాజకీయపార్టీల అధ్యక్షుల్లో ఒక్కరు కూడా నోళ్ళు మెదపకపోవడం జరంత ఆలోచించవలసిన విషయమే! ఏం మాట్లాడితే.. ఏ ప్రాంతంలో తమ పార్టీలకు నష్టం వాటిల్లుతుందో అన్న మీమాంసలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం మీద ఈ పరిస్థితులన్నీ అధికార కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయం తీసుకునే విషయంలో ఎటూ పాలుపోని పరిస్థితిలోకి నెట్టివేస్తున్నాయని అనుకోవాలి. తెలంగాణ ఇస్తే సీమాంధ్రులతో కష్టం. ఇవ్వకపోతే తెలంగాణలో నష్టం. ఇచ్చిన ఇవ్వకపోయినా అధికార కాంగ్రెస్ కు ఇదో అరిష్టం. ఓవరాల్ గా కాంగ్రెస్ పరిస్థితి ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’లా తయారైంది. గడువు తేది జనవరి
28 దగ్గరపడే కొద్దీ కాంగ్రెస్ తో పాటు యావత్ రాష్ర్టంలో టెన్షన్ పెరిగిపోవడం మాత్రం తథ్యం అనేది కొట్టిపారేయలేని నగ్న సత్యం…!