మీరు టికెట్ బుక్ చేసుకున్న బస్సు ఎక్కడుందో, తెలుసుకోండిలా …


సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు బయలుదేరే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాము బయల్దేరాల్సిన బస్సు ఎక్కడుందో మొబైల్‌ ఫోన్‌లో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ‘టీఎస్‌ఆర్టీసీ బస్ ట్రాకింగ్‌’ యాప్‌ను వినియోగంలోకి తెచ్చింది. పండుగ సందర్భంగా సీటు రిజర్వేషన్‌ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్‌ వివరాలతోపాటు బస్‌ ట్రాకింగ్‌ లింక్‌ను సందేశ రూపంలో పంపుతున్నారు. లింక్‌పై క్లిక్‌ చేయగానే సంబంధిత బస్సు ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు. టీఎస్‌ఆర్టీసీ బస్‌ట్రాకింగ్‌ పేరుతో ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నది. www.tsrtc.telangana.gov.in నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే బస్సుల వివరాలతోపాటు అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో సులువుగా తెలుసుకోవచ్చు. బస్సు బ్రేక్‌డౌన్‌, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం తదితర వివరాలను ప్రయాణికులు ఈ యాప్‌లో నమోదు చేయవచ్చు.