వనమాకు మరోసారి ఎదురుదెబ్బ.. పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు !


బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లే వరకు, గతంలో ఇచ్చిన తీర్పు అమలు కాకుండా స్టే విధించాలన్న వనమా పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. కొద్దిరోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లే వరకు స్టే విధించమని వనమా కోర్టును కోరారు. అయితే వనమా పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

కాగా.. కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని.. 2018, డిసెంబర్‌ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కొత్తగూడెం శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ చెప్పినట్లు జలగం వెంకట్రావు మీడియాకు తెలిపారు. ఈ అంశంపై తాను అసెంబ్లీ స్పీకర్‌తో ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు.