బాధితులకు అండగా – చంద్రబాబు

Chandrababu వీటీపీఎస్ వేడి నీటి కాలువలో పడి పన్నెండేళ్ల బాలుడు దుర్మరణం పాలైన ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఈనెల 3న జరిగిన ఈ ప్రమాదంపై బాలుడు తల్లి మస్తాన్ బీ శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిసి కన్నీటిపర్యంతమైంది. దీనిపై చలించిన ముఖ్యమంత్రి తక్షణ సాయంగా రూ.2లక్షలు అందించడమే కాకుండా కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

తమ సమస్యల్ని చెప్పుకుని ఊరట పొందేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరితో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి వారి సమస్యలు ఆలకించారు. తక్షణసాయాల్ని ప్రకటించారు. కృష్ణాజిల్లాకు చెందిన తులసీకుమారి తన భర్తకు హెచ్ఐవీ సోకి మంచానపడటంతో కుటుంబపపోషణ భారంగా మారిందని తెలుపగా, ఆమెకు రూ.50వేల సాయం ప్రకటించారు. మరో హెచ్ఐవీ బాధితురాలు తన బాధలు చెప్పుకోగా ఆమెకి రూ.50 వేలు అందించారు. గుంటూరు జిల్లాకు చెందిన కె వెంకమ్మ తన భర్త చనిపోయి పిల్లల్ని చదివించుకునే ఆర్థికస్థోమత లేక ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పగా, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తక్షణ సాయం కింద రూ.25 వేలు అందించి, ఇల్లు మంజూరు చేశారు. అంతేగాక, పిల్లల్ని బీసీ హాస్టల్‌లో చేర్పించి మంచి విద్య అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పిల్లల్ని చదివించుకోలేకపోతున్నానని కృష్ణాజిల్లాకు చెందిన ఎ లక్ష్మీ తన బాధలు చెప్పుకోగా, కాపు కార్పొరేషన్ ద్వారా ఆమెకు ఉపాధి కల్పించాలని, పిల్లల్ని చదివించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎం రవళి అనే పదో తరగతి విద్యార్థిని తల్లిని వెంటపెట్టుకుని వచ్చి ఉన్నత చదువుల కోసం అభ్యర్థించగా, కాపు కార్పొరేషన్ ద్వారా సహాయం అందిస్తామని సీయం చెప్పారు. అప్పుల బాధలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకటరమణ చెప్పుకోగా, అతనికి రూ.50 వేలు, కేన్సర్‌తో బాధ పడుతున్న చిత్తూరుజిల్లావాసి సురేష్ కుమార్‌కు మరో రూ.50వేలు చొప్పున ముఖ్యమంత్రి సహాయం ప్రకటించారు. విజయవాడకు చెందిన రామలింగేశ్వరరావు అనే పేద బ్రాహ్మణుడికి ఇల్లు మంజూరుచేశారు. ఇంకా అనేకమందికి వారి ఇబ్బందులు విని ముఖ్యమంత్రి తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. వారందరికీ ఇళ్లు, పెన్షన్లు అందించాలని అధికారులకు చెప్పారు.

కొత్తగా ఏర్పాటుచేసిన అత్యంత వెనుకబడిన కులాల సంస్థ (ఎంబీసీ కార్పొరేషన్) ఏర్పాటుచేసినందుకు మంత్రి కొల్లు రవీంద్ర నాయకత్వంలో ఆ సామాజిక వర్గాలకు చెందిన పలువురు పెద్దలు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.