గ్రూప్ 1 సహా పలు పరీక్షలు రద్దు.. మరికొన్ని వాయిదా


ప్రశ్నపత్రాల లీకేజీలపై లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది అక్టోబర్ 16వ తేదీన జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ పరీక్షను తిరిగి జూన్ 11న మళ్లీ నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఏఈఈ, ఫిబ్రవరి 26న జరిగిన డీఏఓ పరీక్షలను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. మరోవైపు జూలైలో జరగాల్సిన జూనియర్ లెక్చరర్ల పరీక్షలు వాయిదా వేసింది.

అయితే.. ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావటంతోనే అప్రమత్తమైన అధికారులు.. వెంటనే టౌన్ ప్లానింగ్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ ఇన్‌స్పెక్టర్ పరీక్షలను వాయిదా వేశారు. ఇక ప్రవీణ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్‌లో నాలుగు ఎగ్జామ్ పేపర్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ పేపర్లను రాజశేఖర్.. తన సిస్టం నుంచి కాపీ చేసి ప్రవీణ్‌కు అందజేసినట్టు గుర్తించారు. కాగా.. రానున్న మూడు నెలల్లో 20కి పైగా టీఎస్పీఎస్సీ పరీక్షలు జరుపుతుందన్న నేఫథ్యంలో ఈ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావటంతో.. మరిన్ని అక్రమాలు జరగాకుండా ఇప్పటికే తయారు చేసిన పేపర్ల స్థానంలో కొత్త పేపర్లతో పరీక్ష నిర్వహించడానికి కమిషన్ కసరత్తు చేస్తోంది.